మంచి సమయాన్ని మిస్ చేసుకుంటున్న తెలంగాణ బీజేపీ!

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని గత కొన్నేళ్లుగా బీజేపీ గట్టిగా కోరుకుంటోంది. కర్నాటక తర్వాత ఆ పార్టీ బలంగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. అందుకే తెలంగాణపై పట్టు సాధించేందుకు అనేక రకాల వ్యూహాలు రచిస్తోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలిచిన ఆ పార్టీ.. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుంది. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను జీరోకు పరిమితం చేసింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకంతా బీజేపీ వైపు మళ్లిందని అంచనా వేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ను ఖాళీ చేసి బలపడాలనుకుంటోంది బీజేపీ. అయితే ఇందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ స్వల్ప మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. రేవంత్ సర్కార్ చాలా రోజులు ఉండదని బీఆర్ఎస్ చెప్తూ వస్తోంది. దీన్ని సవాల్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. ఆ పార్టీని ఖాళీ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనే పట్టుదలతో ఆయన పనిచేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్తున్నారు.
ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం ఏమీ చేయలేకపోతోంది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ అండతోనే ఇన్నాళ్ళూ ఇక్కడ బీజేపీ బలపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ దూకుడు ముందు బీజేపీ తేలిపోతోంది. అయితే ఇందుకు ఆ పార్టీ పెట్టుకున్న కొన్ని రూల్స్ కూడా ఆటంకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ వైపు వెళ్లలేని పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. అయితే బీజేపీలోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేసి రావాలని ఆ పార్టీ నేతలు చెప్తుండడంతో బీఆర్ఎస్ నేతలు వెనక్కు తగ్గుతున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు.
రాజీనామాలు చేసి రావాలని బీజేపీ చెప్తుండడంతో ఆ పార్టీ వైపు వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. గతంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు కూడా ఇదే భయం పట్టుకుంది. రాజీనామా చేసి వెళ్ళి ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటని వాళ్లు భయపడుతున్నారు. ఇలాంటి రిస్క్ తీసుకోకపోవడమే మేలు అనుకుంటున్నారు. అందుకే అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీ మాత్రం ఏమి చేయాలో ఆర్థం కాక తలలు పట్టుకుంటోంది. పార్టీ బలపడేందుకు ఇదే మంచి సమయం. అయినా ఏమీ చేయలేకపోతోంది.