KTR – Kavitha : బీఆర్ఎస్‌లో ప్రకంపనలు.. కవిత లేఖతో కేటీఆర్ పరోక్ష హెచ్చరికలు

భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి. రామారావు (KTR) తాజాగా చేసిన వ్యాఖ్యలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలను మరింత స్పష్టం చేశాయి. ముఖ్యంగా, కవిత (Kavitha) రాసిన ఒక లేఖ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) కు రాసిన లేఖలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. దీంతో ఈ లేఖ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే దీనిపై నేరుగా స్పందించేందుకు కేటీఆర్ నిరాకరించారు. పరోక్షంగా కవితకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని, అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు.
“మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది, ఎవరైనా మా నాయకుడికి ఉత్తరాలు రాయవచ్చు. అయితే, అంతర్గత విషయాలను బయట మాట్లాడకపోతే మంచిది” అని కేటీఆర్ స్పష్టం చేశారు. కవిత రాసిన లేఖపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ నేరుగా స్పందించలేదు. అయితే పరోక్షంగా కవితను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం కవిత పేరు కూడా ప్రస్తావించకుండే కేటీఆర్ ఇలా మాట్లాడడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కవిత తన చెల్లి అని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మేం చర్చించుకుంటామని కేటీఆర్ చెప్పి ఉండొచ్చు. కానీ అలా చెప్పేందుకు కేటీఆర్ ఇష్టపడలేదు. దీంతో కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలున్నాయనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశం ఇటీవల వరంగల్ లో జరిగింది. దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు కవిత ఓ లేఖ రాశారు. “పార్టీ కార్యకర్తలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ద్వారా బీజేపీతో సంబంధాలు ఏర్పడుతున్నాయనే సంకేతం వెళ్లింది” అని అందులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఏదో ఉందనే ఊహాగానాలను బలపరిచాయి. ఈ లేఖ బయటకు రావడంతో పార్టీలో ఆందోళన వ్యక్తమైంది. కేటీఆర్, “పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరూ సమానమే” అని చెప్పినప్పటికీ, కవిత లేఖను లీక్ చేసిన విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ముగించుకుని అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత.. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ తనదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడని, అయితే ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఆరోపించారు. ఆ లేఖ బయటకు రావడం వెనుక కొంతమంది కోవర్టులు ఉన్నట్టు కవిత ఆరోపించారు. కవిత వ్యాఖ్యలు తీవ్ర సంచలనం కలిగించాయి. వీటిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. కానీ కేటీఆర్ మాత్రం కవిత పేరు కూడా ఎత్తకుండా పరోక్ష హెచ్చరికలకు మాత్రమే పరిమితం అయ్యారు.
పార్టీలో కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారాలతో విభేదాలు నిజమేనని అర్థమవుతోంది. పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో కవిత తన స్థానం కోసం పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లేఖ బీఆర్ఎస్‌లో ఆంతర్యంగా ఉన్న అసంతృప్తిని, నాయకత్వ సంక్షోభాన్ని సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.