KCR Family: కేసీఆర్ కుటుంబంలో చీలక రాబోతోందా..?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కెసీఆర్ (KCR) కుటుంబంలో చీలిక రాబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత (Kavitha), ఆయన మేనల్లుడు హరీశ్ రావు (Harish Rao) , కుమారుడు కె.టి.ఆర్ (KTR) మధ్య అంతర్గత రాజకీయ విభేదాలు పెరుగుతున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. ఇది పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు కారణమవుతాయనే చర్చ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసులో జైలు శిక్ష అనుభవించి 2024 ఆగస్టులో బెయిల్‌పై విడుదలయ్యారు కవిత. అప్పటి నుంచి పార్టీలో తన పాత్రను బలోపేతం చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కవితకు ప్రముఖ పాత్ర లభించింది. అయినా కేటీఆర్ ఆధిపత్యం కారణంగా ఆమె అసంతృప్తితో ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు కవిత తన సొంత సంస్థ- తెలంగాణ జాగృతి ద్వారా రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీలో తన పరిస్థితి దిగజారుతున్నందునే కవిత తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ద్వారా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు కూడా పార్టీలో తన పాత్ర సంతృప్తికరంగా లేకపోవడంతో కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత, హరీశ్ రావును మెదక్ జిల్లాకు పరిమితం చేయడం, పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్, కవితలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఒక బీజేపీ నేతతో కలిసి హరీశ్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్‌లో చీలిక రాబోతుందని ఊహాగానాలు వస్తున్నాయి. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు హరీశ్ వెంట నడిచే అవకాశం కూడా ఉందని కొందరు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరిపి విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారని సమాచారం. “నా నాయకుడు కేసీఆర్, ఆయన చెప్పినట్లు చేస్తాను” అని హరీశ్ రావు ప్రకటించడం ద్వారా విభేదాలను తిరస్కరించే ప్రయత్నం చేశారు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఆరోపణలను హరీశ్ రావు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అయితే సోషల్ మీడియాలో కేటీఆర్, కవితలు హరీశ్ రావును ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారనే వార్తలు వైరల్ కావడం గందరగోళాన్ని మరింత పెంచింది.
మరోవైపు.. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత, కేసీఆర్ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో నాయకత్వ శూన్యత ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావు, కవితలు పార్టీ కార్యకలాపాలను నడిపిస్తున్నప్పటికీ, కేసీఆర్ నిశ్శబ్దం పార్టీ క్యాడర్‌లో అయోమయాన్ని సృష్టిస్తోంది. కేసీఆర్ ఇటీవల బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ, కుటుంబంలోని విభేదాలపై స్పష్టత ఇవ్వలేదు.
బీఆర్ఎస్‌లో నాయకత్వ సంక్షోభం, కుటుంబ విభేదాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన బీఆర్ఎస్, ఇప్పుడు అంతర్గత రాజకీయ గందరగోళంతో సతమతమవుతోంది. కవిత, హరీశ్ రావు కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు నిజమైతే, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ స్థానం మరింత బలహీనమవుతుంది. అయితే, ఈ విభేదాలను పరిష్కరించి, పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాబోయే రోజుల్లో తేలనుంది.