Kavitha: కవితపై వేటుకు రంగం సిద్ధమవుతోందా..?
భారత రాష్ట్ర సమితి (BRS)లో చోటు చేసుకుంటున్న సంచలన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసిన ఆరు పేజీల లేఖ లీక్ కావడంతో పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే ప్రచారం బలపడింది. ఈ లేఖలో కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కవితపై వేటు వేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతోందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కవిత సొంత పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
కవిత రాసిన ఆరు పేజీల లేఖ వెలుగులోకి రావడం బీఆర్ఎస్లో పెను కల్లోలం సృష్టించింది. ఈ లేఖలో కవిత, కేసీఆర్ బీజేపీతో సన్నిహిత వైఖరిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, పార్టీ నిర్ణయాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు. పార్టీలో సీనియర్ నేతలకు ప్రాధాన్యత లేకపోవడం, వరంగల్ సభలో కేసీఆర్ ప్రసంగం “పంచ్లెస్”గా ఉందని, బీజేపీపై గట్టిగా విమర్శలు చేయలేదని కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Scam Case) జైలు శిక్ష అనుభవించిన కవిత, బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నప్పటికీ, పార్టీ అధిష్టానం తనను అడ్డుకుంటోందనే భావనలో ఉన్నారు.
ఈ లేఖ లీక్ కావడం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీసింది. కవిత ఈ లేఖను గోప్యంగా ఉంచాలని భావించినప్పటికీ, పార్టీలోని కొందరు కోవర్ట్ నేతలు ఉద్దేశపూర్వకంగా దాన్ని బయటపెట్టినట్లు కవిత ఆరోపించారు. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని కవిత విమర్శించారు. వాళ్ల వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కవిత కామెంట్స్ పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరోక్షంగా స్పందించారు. పార్టీలో ఏదైనా ఇబ్బంది ఉంటే అంతర్గతంగా చర్చించాలని సూచించారు.
కవిత లేఖ లీక్ తర్వాత ఆమె పార్టీలో కొంతమంది దయ్యాలున్నారని వ్యాఖ్యానించడం హైకమాండ్ కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. అందుకే ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆమెను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస రెడ్డి (Yennam Srinivas Reddy) ఇప్పటికే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అయితే, కవితపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కేసీఆర్ కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆదేశాలు నిజమైతే, పార్టీలో అంతర్గత కల్లోలాన్ని అణచివేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంగా భావించవచ్చు.
కవితపై వేటు వేసే విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, లేఖ లీక్ ఘటన తర్వాత పార్టీలో చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కవిత ఒత్తిడి చేస్తున్నారు. మరి కవిత డిమాండ్ కు పార్టీ హైకమాండ్ తలొగ్గుతుందా అనేది వేచి చూడాలి.
మరోవైపు.. పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తిలో ఉన్న కవి.. సొంత పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ మద్యం కేసు తర్వాత పార్టీలో తన స్థానం బలహీనపడిందని, తనపై దుష్ప్రచారం జరుగుతున్నా అధిష్టానం పట్టించుకోవడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించేందుకు కవిత సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కవిత తదుపరి అడుగును బీఆర్ఎస్ హైకమాండ్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. లేఖ లీక్ ఘటన తర్వాత, పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కవిత డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అదే సమయంలో, కవిత వైఖరి పార్టీకి నష్టం కలిగిస్తే, సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.






