BRS-BJP: బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై ఊహాగానాలు.. సాధ్యమేనా..?

తెలంగాణ రాజకీయ వేదికపై బీఆర్ఎస్ (BRS) అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తాజా వ్యవహారశైలి రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది. గతంలో బీజేపీని (BJP) గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా పర్యటించిన కేసీఆర్, ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలను పూర్తిగా తగ్గించేశారు. వరంగల్‌లో (Warangal) జరిగిన రజతోత్సవ సభలో బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనల్లో కేసీఆర్ ఉన్నారని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ (Congress) ను చిన్నచూపు చూసిన కేసీఆర్ ను, హస్తం పార్టీ ఏకంగా గద్దె దించింది. దీంతో షాక్ తిన్న కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతో కలిసి వెళ్లడం మంచిదనే ఆలోచనకు వచ్చారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలు, లగచెర్ల రైతుల అరెస్టులు వంటి అంశాలపై విమర్శలు గుప్పించారు. అయితే గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఈ సభలో బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ మౌనం రాజకీయ వ్యూహంలో భాగమా లేక భవిష్యత్ పొత్తు ఆలోచనలకు సూచనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ బీజేపీని విమర్శించకపోవడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి అనేక మంది నాయకులు కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పోటీపడేందుకు బీజేపీతో పొత్తు ఒక వ్యూహంగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 జులైలో కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. ఇది పొత్తు ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే, బీజేపీ రాష్ట్ర యూనిట్‌లో కొందరు నాయకులు ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్‌తో కలిస్తే బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని వాళ్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) బీజేపీ ప్రతిపక్ష హోదా సాధించింది. బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు మేయర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి సహజంగానే ఆ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉంటుంది. ఇలాంటప్పుడు కాంగ్రెస్ ను డీకొట్టాలంటే బీజేపీతో వెళ్లడం మంచిదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. అయితే ఏపీలో లాగే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాయనే వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రుల ప్రభావం ఎక్కువ. కాబట్టి కూటమిగా ముందుకెళ్తే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలాంటప్పుడు కేసీఆర్ కు స్కోప్ ఉండకపోవచ్చు. మరి కేసీఆర్ ఏ ఉద్దేశంతో బీజేపీని లైట్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు.