అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా : అరెకపూడి గాంధీ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ మరోసారి స్పందించారు. బీఆర్‌ఎస్ కౌశిక్‌రెడ్డికి ఏమైనా పదవి ఇచ్చిందా? నాతో మాట్లాడటానికి బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. దేశ మహిళలను అవమానించేలా చీర, గాజుల గురించి మాట్లాడారు. నీ ఇంటికి వస్తా. కండువా వేసి తీసుకెళ్తా అంటే అర్థమేంటి? ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా? కౌశిక్‌రెడ్డి రౌడీయిజం చేయడం దేనికి? తీరు మార్చుకోవాలి. అతను రెచ్చగొట్టినందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అన్నారు.
మాపైనే బీఆర్‌ఎస్ నేతలు దాడి చేశారు. మేము ఒక్కరిపై కూడా దాడి చేయలేదు. నీ ఇంటికి వస్తే ఏం చేశావు. రాళ్లు రువ్వావు, పూల కుండీలు విసిరావు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నా గురించి పూర్తిగా తెలుసు అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. కేసీఆర్ అంటే ఎప్పటికీ నాకు గౌరవమే. కేసీఆర్ మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. కానీ, కౌశిక్‌రెడ్డి వంటి వాళ్లు ఉంటే పార్టీకి చెడ్డుపేరు వస్తోంది. నోటికి అదుపులేని మనిషిని ఊరుమీదకు వదిలేశారు. అలాంటి వారి వల్లే అధికారాన్ని కోల్పోయాం. కౌశిక్‌రెడ్డి వల్ల కేసీఆర్ గొప్ప మనస్తత్యానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు వస్తుంది అని అన్నారు.