Chevireddy: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం (AP Liquor Scam Case) కేసులో వైసీపీ కీలక నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy bhaskar Reddy) అరెస్ట్ అయ్యారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Bengaluru Airport) మంగళవారం ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన్ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐటీ (SIT) పోలీసులు బెంగళూరు వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, డిస్టిలరీలు, లైసెన్స్ ల విధానంలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నమోదైంది. దాదాపు 3 వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎస్ఐటీ గుర్తించింది. మద్యం ద్వారా అక్రమంగా సేకరించిన నిధులను వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38వ నిందితుడిగా, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 39వ నిందితుడిగా, ఆయన సన్నిహితుడు వెంకటేశ్వర్లు నాయుడు 34వ నిందితుడిగా ఎస్ఐటీ గుర్తించింది. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేశ్వర్లు నాయుడు కూడా అరెస్టయ్యాడు. అరెస్ట్ తర్వాత, వీరిని విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎస్ఐటీ దర్యాప్తు ప్రకారం, ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా సుమారు 250-285 కోట్ల రూపాయల నిధులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఆరు జిల్లాల్లో వైసీపీ ఎన్నికల కార్యకలాపాల కోసం పంపిణీ చేసింది. ఈ నిధులు మద్యం డిస్టిలరీలు, సరఫరా సంస్థల నుంచి అక్రమంగా సేకరించినవని గుర్తించింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఈ అరెస్ట్ ను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఎస్ఐటీ అధికారులు తమ మాజీ గన్‌మెన్‌లైన మదన్ రెడ్డి, గిరిని చిత్రహింసలకు గురిచేసి, తమపై అబద్ధపు స్టేట్‌మెంట్లు ఇప్పించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. మదన్ రెడ్డి ఈ ఆరోపణలతోనే డీజీపీకి లేఖలు రాశారు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెవిరెడ్డి సతీమణి లక్ష్మీ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో, చెవిరెడ్డి ఒక వాయిస్ మెసేజ్‌లో తనపై ఎలాంటి తప్పు లేదని, ఈ కేసు జగన్‌ను టార్గెట్ చేసే కుట్రలో భాగమని ఆరోపించారు. వైసీపీ నాయకత్వం ఈ అరెస్ట్ ను ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యగా విమర్శించింది.
ఎస్ఐటీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సహచరులపై సీసీటీవీ ఫుటేజీలు, వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకున్న 8 కోట్ల రూపాయల నగదు ఈ కుంభకోణంతో ముడిపడి ఉందని, ఇది చెవిరెడ్డి పాత్రను స్పష్టం చేస్తుందని ఎస్ఐటీ తెలిపింది.