Jagan: జగన్ మాటల్లో కొత్తదనం.. ప్రెస్ మీట్ లో పదును తగ్గిందా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఓ ప్రత్యేక శైలిలో పాలిటిక్స్ చేస్తారని చాలా మంది నమ్మారు. కానీ ఇటీవల ఆయన తీరు చూసినవారికి ఆ అభిప్రాయం మారుతోంది. ఎప్పుడూ కొత్తదనం చూపించే నేతగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు అదే పాత స్టైల్‌ను పదే పదే తిప్పి తిప్పి వినిపిస్తున్నారని వైసీపీ (YSRCP)లోనే కొందరు చెబుతున్నారు. గతంలో పాదయాత్రలతో ప్రజల మనసులు గెలుచుకున్న ఆయన ఇప్పుడు మీడియా సమావేశాల్లో చెప్పే మాటలు మునుపటిలా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు.
ప్రెస్ మీట్లు మొదట్లో ఆసక్తికరంగా ఉండేవి. కొత్త అంశాలు, రిక్వస్ట్‌లు, ఆరోపణలతో వార్తల్లో నిలిచేవి. కానీ ఇప్పుడు జగన్ మాట్లాడే ప్రతి మాట అదే పాత స్టయిల్లోనే ఉందని అంటున్నారు. ముఖ్యంగా “మేమే అధికారంలోకి వస్తాం”, “మీ అంతు చూస్తాం”, “మీ బుక్కులు మా దగ్గరే ఉన్నాయి” అనే డైలాగులు పునరావృతం అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇది విని ప్రజలు ఆసక్తి కోల్పోతున్నారని పార్టీకి చెందిన నేతలే చెబుతున్నారు.
ఇక ఆయన తరచూ పోలీసులపై వాఖ్యలు చేస్తుండటంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో లేని పార్టీ తమకు వ్యతిరేకంగా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒకసారి ఎవరో ఏదైనా మాట్లాడితే, అది అప్పటికే వెయ్యి పోస్టుల రూపంలో ప్రజలకు చేరిపోతుంది. అలాంటి సమయంలో అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం బోరింగ్‌గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాక, గతంలో జగన్ మీడియా సమావేశాలు పెడితే ప్రజల దృష్టిని ఆకర్షించగలిగేవి. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే “ఇప్పుడు ఆయన మాట్లాడేది చెప్పినంత సేపే, ఎఫెక్ట్ మాత్రం ఉండదు” అంటున్నారు. ఇది ప్రెస్ మీట్ల ప్రభావాన్ని తగ్గించేస్తోంది. మళ్లీ మళ్లీ అవే మాటలు, అవే హెచ్చరికలు, అవే ఆరోపణలు మునుపటిలా ప్రజలకు టచ్ అవ్వడం లేదు.
ఇక కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా, అవి ప్రజల మనసు తాకట్లేదని అంటున్నారు. అవినీతి, అక్రమాలపై మాట్లాడితేనే ప్రజలకు కనెక్ట్ అవుతుందని పార్టీ నుంచే సూచనలు వస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే జగన్ ప్రస్తుతం చేస్తున్న మీడియా యాత్రల తీరు మారాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే “ ఎప్పుడూ చెప్పేదే కదా ఏం వింటాం” అనే మాటలు ఆయనకే ఎదురవుతాయని నాయకులే గట్టిగా అంటున్నారు. మరి ఈ సందర్భంలో జగన్ తన స్టైల్ మార్చుకుంటారా లేదా అన్న విషయం చూడాలి.