Jagan: రేషన్ దుకాణాల పునరుద్ధరణపై జగన్ విమర్శలు..

జూన్ 1 ఆదివారం నుండి ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి రేషన్ దుకాణాలు (Ration Shops) ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం మూసివేసిన ఈ దుకాణాలను ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ తెరవడం లబ్ధిదారులకు ఊరటనిచ్చింది. ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మాత్రం దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. ‘‘డోర్ డెలివరీ’’ విధానాన్ని రద్దు చేయడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేదల పట్ల కక్షతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
నిజానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న నూతన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు అన్ని అంశాలపై సవివరంగా పరిశీలన చేసింది. రేషన్ పంపిణీ ప్రక్రియను నాలుగు దశల్లో సర్వే చేశారు. అందులో లబ్ధిదారుల అభిప్రాయాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకున్నారు. గడిచిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనాల ద్వారా డోర్ డెలివరీ విధానం చాలామందికి ప్రయోజనం కలిగించలేదని స్పష్టంగా తేలింది. పైగా, ఆ విధానంను కొంతమంది దుర్వినియోగం చేసినట్లు కూడా తేలింది.
ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, ఈ వాహనాల ద్వారా సరుకులు అవసరమైనవారికి కాకుండా, అక్రమ మార్గాల్లోకి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే పాత పద్ధతిలో, అంటే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఈ విషయాన్ని గుర్తుచేశారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ మార్పును తీసుకురావడంలో ఎటువంటి కక్షలూ పెట్టుకోలేదని చెబుతున్నారు.
జగన్ చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవిగా చెప్పుకుంటున్నారు తెలుగు దేశం పార్టీ (TDP) నేతలు. ప్రభుత్వం డోర్ డెలివరీ విధానాన్ని మాత్రమే కాకుండా, అనేక ప్రజాసేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతోంది. పింఛన్లు పెంపు, డీఎస్సీ (DSC) ప్రకటన, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇవన్నీ ప్రజల శ్రేయస్సు కోసమే చేపట్టినవి. అలాంటి సమయంలో “విజన్ లేకుండా నిర్ణయం తీసుకున్నారు” అన్న జగన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే, నిజాలు గమనించి విమర్శించాలని అంటున్నారు.