Jagan: చంద్రబాబు పాలనపై జగన్ ఘాటు విమర్శలు..జీఎస్టీ వాస్తవాల పై ట్వీట్

2024 ఎన్నికల ఓటమి తర్వాత చాలా వరకు సైలెంట్ అయిపోయిన జగన్ (Jagan) గత కొద్దికాలం గా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాక, రాజకీయ కక్షలతో నేరపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థితికి చేరాయని, ప్రజలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా జగన్ స్పందిస్తూ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్ర కాగ్ (CAG) నివేదికలను ప్రస్తావిస్తూ, రాష్ట్రానికి చెందిన ఆదాయ లెక్కల్లో పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయని గుర్తు చేశారు. గత నెలలో టీడీపీ (TDP) ప్రభుత్వం ఏప్రిల్‌లో రాష్ట్రానికి జీఎస్టీ (GST) ద్వారా రూ. 3,354 కోట్లు వచ్చాయని ప్రకటించినప్పటికీ, కాగ్ లెక్కల ప్రకారం ఇది తప్పని, వాస్తవాలు వేరేనని తెలిపారు.
2025 ఏప్రిల్‌లో ప్రభుత్వ ఆదాయం గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే దాదాపు 24.20 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఇది ఆర్థికంగా రాష్ట్రం ఎంత వెనకడుగు వేసిందనే విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. సర్దుబాటు లెక్కల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిన నేపథ్యంలో నికర జీఎస్టీ ఆదాయం కూడా తక్కువగానే నమోదైందని కాగ్ వివరించిందని జగన్ వెల్లడించారు. ఇప్పటికే పన్నుల ఆదాయం 12.21 శాతం తగ్గడం, అలాగే పన్నేతర ఆదాయాల్లో 22.01 శాతం పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. మే నెలలో జీఎస్టీ ఆదాయాలు పెరిగాయని ప్రభుత్వం ప్రకటించినా, ఏప్రిల్ నెమ్మదిని కప్పిపుచ్చేందుకు ఇదంతా ఒక ప్రకటనగా మిగిలిపోయిందని ఆరోపించారు.
ఆర్థిక విషయాల్లో నిజాలను వెలుగులోకి తేవడం వల్లే ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయని, అందుకే కాగ్ నివేదికను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేసేవారు వాస్తవాలను గమనించి ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. తన ట్వీట్‌లో సంబంధిత డాక్యుమెంట్లను కూడా షేర్ చేశారు. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..