YSRCP: వైసీపీ వెన్నుపోటు దినం సక్సెస్..! కూటమి ప్రభుత్వం సహకరించిందా..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేందుకు వైసీపీ నాయకత్వం పెద్ద ఎత్తున కేడర్‌ను రోడ్లపైకి తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం (NDA Govt) అనుసరించిన ఉదార వైఖరి, ఆంక్షలు విధించకపోవడం, పోలీసు సహకారం లాంటివి వెన్నుపోటు దినం విజయం కావడానికి కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024 ఎన్నికల్లో (2024 Elections) ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినం నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) పిలుపునిచ్చారు. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ పిలుపుకు స్పందించిన వైసీపీ కేడర్.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టింది. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందంటూ స్టులు చేస్తున్నారు. ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించినట్లు పేర్కొన్నారు.
అయితే.. వైసీపీ హయాంలో 2019-2024 మధ్య ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ (TDP), జనసేన (Janasena) నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు.. అప్పటి జగన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించేది. అనుమతులు నిరాకరించడం, పోలీసు బలగాలను ఉపయోగించి నిరసనలను అణచివేయడం, నాయకులను గృహనిర్బంధంలో ఉంచడం సర్వసాధారణంగా జరిగేవి. 2023లో టీడీపీ నాయకుడు చంద్రబాబు (Chandrababu), జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు పోలీసు జోక్యం తీవ్రంగా ఉండేది.
కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇందుకు భిన్నమైన వైఖరిని అనుసరించింది. వైసీపీ నిరసన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడమే కాక, పోలీసు బలగాలను కేవలం భద్రత కోసం మాత్రమే ఉపయోగించింది. ర్యాలీలు, ధర్నాలు నిర్విఘ్నంగా జరిగేలా సహకరించింది. ఈ ఉదార వైఖరి వల్ల వైసీపీ కేడర్ స్వేచ్ఛగా తమ నిరసనలను వ్యక్తం చేయగలిగారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందని కొందరు విశ్లేషకులు అభివర్ణించారు. ఆంక్షలు విధించి వైసీపీని హీరోను చేయకుండా.. నిరసనలకు సహకరించడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ కేడర్ రోడ్లపైకి రావడం వెనుక ప్రజల్లో నిజంగానే అసంతృప్తి ఉందా, లేక నాయకులు జనాన్ని సమీకరించారా అనేది చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ఈ నిరసనలను ప్రజల ఆగ్రహంగా చిత్రీకరించినప్పటికీ, కొందరు విశ్లేషకులు ఇది పార్టీ కేడర్‌ను సమీకరించడం ద్వారా సాధించిన విజయమని అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఇప్పటికీ గణనీయమైన మద్దతును కలిగి ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కారణంగా. అయితే, కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నిరసనలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దోహదపడ్డాయి.