కేసీఆర్, జగన్ అసెంబ్లీలకు వెళ్తారా…?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వాలు మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి టీడీపీ కూటమి గద్దెనెక్కింది. దీంతో ఓడిన పార్టీలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా.. లేదా.. అనేది ఆసక్తి కలిగిస్తోంది. వచ్చే వారంలో బడ్జెట్ సమావేశాలు రెండు రాష్ట్రాల్లో ప్రారంభం కాబోతున్నాయి. దీంతో వీళ్ల రాకపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ పగ్గాలు చేపట్టాక బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు కూడా బీఆర్ఎస్ ను వీడిపోతున్నారు. కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. దీంతో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. అసెంబ్లీ సమావేశాల నాటికి మరికొందరు పార్టీ ఫిరాయిస్తారనే సమాచారం అందుతోంది. అదే జరిగితే ప్రతిపక్ష హోదా కూడా ఊడుతుందేమోననే భయం బీఆర్ఎస్ ను వెంటాడుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో 2019లో ఘన విజయం సాధించిన వైసీపీ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ ఓటమిని వైసీపీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓటమి నుంచి ఆ పార్టీ నేతలు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాలు కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారానికే పరిమితమయ్యాయి. దీనికి జగన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తమ బలం తక్కువగా ఉంది కాబట్టి సభలో తమకు గౌరవం దక్కుతుందనే నమ్మకం తమకు కలగట్లేదని జగన్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఆయన సభకు వస్తారా రారా అనేది తెలియట్లేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి జరుగనున్నాయి. రేవంత్ పాలనపై బయట బీఆర్ఎస్ పలు విమర్శలు చేస్తోంది. మరి ఇవే విమర్శలను సభకు వచ్చి చేస్తుందా అనేది తెలియట్లేదు. కేసీఆర్ సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. గత పదేళ్ల అవకతవకలకను ఎండగట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా భారీగా గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. వీటన్నిటినీ కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ కు ఇలాంటి పరిస్థితే ఉంది. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. 11 మందితో టీడీపీ కూటమిని ఎదుర్కోలేమని తెలుసు. కాబట్టి ఆయన హాజరవుతారనేది అనుమానంగానే ఉంది. వీళ్లిద్దరి రాకకోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.