ఏపీ విద్యార్థినికి అమెజాన్ ఆఫర్.. రూ.44 లక్షల ప్యాకేజీతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థినికి అమెజాన్లో భారీ ఫ్యాకేజీతో కొలువు సాధించింది. ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ మేరకు ఆమెకు అమెజాన్ నుంచి కాల్ లెటర్ అందింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామానికి చెందిన ఉన్నగిరి కక్కయ్య, లక్ష్మీకాంతం దంపతుల కుమార్తె లావణ్య గుంటూరు వీవీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ ఫైనలియర్ చదువుతోంది. ఈ క్రమంలో ఇటీవల కళాశాలలో అమెజాన్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్తా చాటింది. ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందింది. చిన్ననాటి నుంచి చదువులో ముందుంటున్న లావణ్య పదోతరగతిలో 9.6 గ్రేడ్, ఇంటర్మీడియెట్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించింది. తమ కుమార్తెకు అమెజాన్లో కొలువు దక్కడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్తులు లావణ్యను అభినందనలతో ముంచెత్తారు.






