Vijaya Sai Reddy – Chandrababu: బీజేపీలో విజయసాయి రెడ్డి చేరికకు చంద్రబాబు NOC ఇవ్వాలా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP), రాజ్యసభ (Rajya Sabha) సభ్యత్వానికి విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. అయితే విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. బీజేపీలో (BJP) చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆయన్ను చేర్చుకునేందుకు బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఒక షరతు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు (Chandrababu) నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటే పార్టీలో చేర్చుకునేందుకు తాము సిద్ధమేనని బీజేపీ హైకమాండ్ చెప్పినట్లు టాక్.
వైసీపీలో ఎన్నో ఏళ్లపాటు నెంబర్ టూగా చక్రం తిప్పారు విజయసాయి రెడ్డి. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే విజయసాయి రెడ్డి స్థానం 2 నుంచి 2వేలకు దాటి పోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఒకానొక సమయంలో తాడేపల్లి గడప కూడా తొక్కనీయలేదు. ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత కేసులు చుట్టుముట్టడం ప్రారంభించాయి. దీంతో వైసీపీలో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించిన విజయసాయి రెడ్డి వ్యూహాత్మకంగా పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు.
అయితే బీజేపీ మెప్పుకోసమే విజయసాయి రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారని అందరికీ తెలుసు. రాజ్యసభకు రాజీనామా చేయడం ద్వారా ఆ స్థానం బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. తద్వారా బీజేపీకి మేలు చేసినట్లవుతుంది. ఆ పలుకుబడితో తన పనులు చేసుకోవచ్చనేది విజయసాయి రెడ్డి వ్యూహం. బీజేపీ కూడా ఇందుకు సరేననడంతో ఆయన బయటకు వచ్చేశారు. లిక్కర్ స్కాం లాంటి వాటిలో వైసీపీ అక్రమార్కుల బట్టలూడదీస్తానని చెప్పారు. తద్వారా కూటమి పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లిక్కర్ స్కాంలో విజయసాయి రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతో ఇలాంటి కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అండ తప్పనిసరి అని ఆయనకు తెలుసు.
విజయసాయి రెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధమైనా ఒక షరతు పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. లేకుంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే మిమ్మల్ని మేం వెనకేసుకు రావడం ఇబ్బందికరంగా ఉంటుందని, అందుకే చంద్రబాబు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. అందుకే విజయసాయి రెడ్డి చేరిక బీజేపీలో ఆలస్యమవుతోంది. ఒకవేళ చేరిపోయి ఉంటే మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే వారేమో.
ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారం చంద్రబాబు కోర్టులో ఉంది. మరి ఆయన విజయసాయి రెడ్డికి పర్మిషన్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు ఫ్యామిలీపై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. బుల్లి నాయుడు అంటూ లోకేశ్ ను తిట్టేవారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైన తర్వాత కూడా ఆమెను టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోయారు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి విజయసాయి రెడ్డిని క్షమించేస్తే కేడర్ అంత సులువుగా వదిలి పెట్టదు. అందుకే ఈయన విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.