Venkaiah Naidu: ఎమర్జెన్సీ నా జీవితాన్ని మలుపు తిప్పింది : వెంకయ్య నాయుడు
రాజ్యాంగం పట్ల విశ్వాసమంటే, దానిలోని అన్ని విషయాలనూ పూర్తిగా నమ్మి, ఆచరించేందుకు సిద్ధపడటమేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడు రామ్మాధవ్ (Ram Madhav) ఆంగ్లంలో రచించిన ముక్కలైన స్వాతంత్య్రం, మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం పుస్తకాల తెలుగు అనువాదాలను విజయవాడ (Vijayawada) పుస్తక మహోత్సవంలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం రాతి మీద రాత కాదని, అది చలనశీలమైన ఆలోచనల సమాహారమన్నారు. అవసరాలకు అనుగుణంగా సవరించుకునే వెసులుబాటు హక్కును రాజ్యాంగ నిర్మాతలే భావితరాలకు కల్పించారని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులనే కాక, అందులో పేర్కొన్న విధులను గుర్తించి యువత ఆచరించాలని సూచించారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండే రచనలు పెరగాలని ఆకాంక్షించారు. సామాజిక బాధ్యత కలిగిన పౌరులంతా పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలని, పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ (Emergency) రూపంలో ప్రజలను ఇబ్బందులు పెట్టింది. ఆ పరిణామం నా జీవితాన్ని మార్చింది. విద్యార్థి నాయకుడిగా ఉన్న నన్ను 18 నెలలు జైల్లో పెట్టారు. దీంతో నేను రాజకీయాల వైపు చూశాను. దేశంలోనే రెండో అత్యున్నత పదవిని వరించే స్థాయికి వెళ్లాను అని గుర్తు చేసుకున్నారు.






