Visakhapatnam: విశాఖ రాజకీయాల వేదికగా వైసీపీలో అంతర్గత సమీకరణలు..
వైసీపీ (YSR Congress Party)లో విశాఖపట్నం (Visakhapatnam) రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సతీమణి బొత్స ఝాన్సీ (Botsa Jhansi) పేరు మళ్లీ చర్చలోకి రావడంతో పార్టీలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో ఆమె విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఒకసారి విజయనగరం (Vizianagaram) నుంచి గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నించారు.
అయితే పార్టీ అధిష్టానం అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana)ను తప్పించి విశాఖ ఎంపీ టికెట్‌ను ఝాన్సీకి కేటాయించింది. ఎంవీవీకి అసెంబ్లీ స్థానం ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఇద్దరికీ కలిసి రాలేదు. దీంతో ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఎంవీవీ తిరిగి విశాఖ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయనకు అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతున్నప్పటికీ, పార్టీ మాత్రం ఆ దిశగా ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఇదే సమయంలో బొత్స ఝాన్సీ మాత్రం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయనగరం నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. ఈ అంశమే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పార్టీ వర్గాల మాట ప్రకారం, ఝాన్సీకి మళ్లీ విశాఖ పార్లమెంట్ స్థానం ఇవ్వాలనే ఆలోచన కూడా అధిష్టానంలో ఉందట. అందుకే అక్కడ ఇప్పటివరకు అధికారిక ఇంచార్జ్‌ను నియమించలేదన్న ప్రచారం వినిపిస్తోంది.
ఇక మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) పేరు కూడా విశాఖ ఎంపీ అభ్యర్థిగా పరిశీలనలో ఉందన్న చర్చ నడుస్తోంది. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నేపథ్యంలో ఆయనను ముందుకు తెచ్చే ఆలోచన పార్టీకి ఉందని అంటున్నారు. కానీ అమర్నాథ్ మాత్రం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో ఒకవైపు రావాలని చూస్తున్న ఎంవీవీకి అవకాశం దక్కకపోవడం, మరోవైపు పార్టీ ప్రతిపాదనకు అమర్నాథ్ సుముఖంగా లేకపోవడం గందరగోళానికి కారణమవుతోంది.
ఈ పరిస్థితుల్లో బొత్స ఝాన్సీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోయినా, విజయనగరం జిల్లాలో ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కార్తీక వనసమారాధన పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో విశాఖకు ఎవరిని పంపించాలన్న అంశంపై వైసీపీ అంతర్గతంగా మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ పెద్దలు ఈ విషయంలో తుది నిర్ణయాన్ని బొత్స సత్యనారాయణకే వదిలేశారని ప్రచారం ఉన్నప్పటికీ, ఆయన ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. మొత్తంగా విశాఖ ఎంపీ టికెట్ చుట్టూ వైసీపీలో నెలకొన్న అనిశ్చితి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.






