Vamsi Wife: గన్నవరం వైసీపీ ఇన్ ఛార్జ్ గా పంకజశ్రీ..?

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (Gannavaram) నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా నిలుస్తుంది. ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వివిధ కేసుల్లో చిక్కుకుని జైలుపాలవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) స్థానికంగా నాయకత్వ శూన్యతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వంశీ భార్య పంకజశ్రీని (Pankaja Sree) నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా నియమించేందుకు పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకు శనివారం నియోజకవర్గ కార్యకర్తలతో పార్టీ కీలక నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశం వైసీపీ రాజకీయ వ్యూహంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి (YCP) బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. గతంలో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ, తర్వాత వైసీపీలో చేరి గన్నవరంలో పార్టీ స్థానాన్ని బలోపేతం చేశారు. తర్వాత 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2024 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ అనుచరులతో కలిసి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ (Satyavardhan kidnap) చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయనపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో, వంశీ అరెస్టై విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత మూడు నెలలుగా జైలులో ఉన్న వంశీ ఆరోగ్యం కూడా క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. శ్వాసకోశ సమస్యలతో ఆయన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత గుంటూరు జనరల్ ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి గన్నవరంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరమైంది. వంశీ రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు నిరాశలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ వంశీ భార్య పంకజశ్రీని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంశీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన భార్య పంకజ శ్రీ ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఆమెకు అండుగా ఉంటున్నారు. వంశీ తరఫున ఆమె కొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాంటి పంకజశ్రీని ఇన్‌ఛార్జ్ గా నియమించడం ద్వారా వైసీపీ రెండు లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది. మొదటిది- వంశీ అనుచరులు, కార్యకర్తలను ఒక్కటిగా ఉంచడం. రెండోది- గన్నవరంలో పార్టీ స్థానాన్ని బలోపేతం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి గట్టి పోటీ ఇవ్వడం. పంకజశ్రీకి రాజకీయ అనుభవం తక్కువైనప్పటికీ.. వంశీ రాజకీయ వారసత్వం, స్థానికంగా ఆయన సామాజిక వర్గంలో ఉన్న పట్టు ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు.
శనివారం జరగనున్న సమావేశంలో వైసీపీ కీలక నేతలు, స్థానిక కార్యకర్తలు పంకజశ్రీ నాయకత్వంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సంబంధించిన వ్యూహాలు, స్థానిక సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. వంశీ అనుచరులైన కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, పంకజశ్రీ నాయకత్వం ద్వారా పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై స్థానిక నాయకుల్లో ఏకాభిప్రాయం కుదిరేనా అనేది పెద్ద ప్రశ్న. గతంలో సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు వంశీతో కలిసి పనిచేయడానికి నిరాకరించారు. ఇప్పుడు కూడా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. పంకజశ్రీ విషయంలో కూడా ఇలాంటి అసమ్మతి తలెత్తే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ.. వంశీ ఆరోగ్యం, రాజకీయ అనిశ్చితి దృష్ట్యా, పంకజశ్రీని ముందుండి నడిపించడం పార్టీకి అనివార్యంగా మారింది.
గన్నవరంలో వైసీపీ కొత్త వ్యూహం ఎలాంటి ఫలితాలను సాధిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. పంకజశ్రీ నాయకత్వం స్థానికంగా ఆమోదం పొందితే, వైసీపీకి గన్నవరంలో కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, టీడీపీ-జనసేన కూటమి కూడా ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటం, వంశీ అనుచరులు కొందరు ఆ పార్టీ వైపు వెళ్లడం వైసీపీకి సవాళ్లుగా మారాయి.