Tirumala Tirupati: తిరుమల వైకుంఠ ఏకాదశి: మైసూరు దసరా తరహా ఏర్పాట్లు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు శ్రీనివాసుడిని (Lord Srinivasa) ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే ప్రత్యేక అవకాశం ఉంటుంది. ఈ పర్వదినం సందర్భంగా తిరుమలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
గత గురువారం తిరుమలలో 62,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 15,680 మంది తలనీలాలు సమర్పించారు. ఆ రోజు హుండీ ద్వారా రూ. 4.17 కోట్ల ఆదాయం వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, టోకెన్ లేకుండా స్వామివారి సర్వదర్శనం కోసం 12-14 గంటల సమయం పట్టింది. ఇక పర్వదినాలలో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి టీటీడీ పాలక మండలి పూనుకుంది.ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం టీటీడీ సిబ్బంది,సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు.
తిరుమలలో ఎంతో ఘనంగా జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలలో ముఖ్యమైనది దీపాలంకరణ. తిరుమల మొత్తం ఎంతో అద్భుతంగా విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది. అయితే ఈసారి ఈ కాంతులను మరింత అద్భుతంగా తయారు చేయడానికి టీటీడీ పాలకమండలి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల ,తిరుపతి వీధులలో చేసే దీపాలంకరణకు మైసూరు దసరా ఉత్సవాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
మైసూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే దీపాలంకరణ మోడల్ ను ఈసారి తిరుమలలో మనం చూడవచ్చు. దీని కోసం మైసూరు దసరా (Mysore Dasara) ఉత్సవాలలో ప్రత్యేకంగా దీపాలను అలంకరించే నిపుణుల సేవలను టీటీడీ వినియోగిస్తోంది. ఈ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకునేలా ఉండనున్నాయి.
భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు, పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పార్కింగ్ ప్రదేశాలు కేటాయిస్తున్నారు. వసతి గదుల బుకింగ్, అన్నప్రసాదం, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల వైకుంఠ ఏకాదశి వేడుకలు ఈసారి మైసూరు దసరా ఉత్సవాలంత వైభవంగా ఉంటాయని టీటీడీ చెబుతోంది.