TTD: గంటలోనే శ్రీవారి దర్శనం.. తిరుమలలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన టీటీడీ

తిరుమలకు వచ్చే భక్తులు రోజుల తరబడి క్యూలైన్లతో వేచి ఉండకుండా.. కేవలం గంటలోనే శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ (TTD) భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా వారం రోజులపాటు ఈ దర్శనం ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు శుక్రవారం నాడు ప్రారంభమైందని టీటీడీ చైర్మన్ తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా భక్తులు ముందుగా ఆధార్ కార్డు నెంబర్, ఫేస్ రికగ్నిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయి రసీదు తీసుకున్న వారికి స్వామివారి దర్శన సమయాన్ని సూచిస్తూ టోకెన్ ఇస్తారు. టోకెన్‌లో నిర్దేశించిన సమయానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాలి. అక్కడ ఫేస్ రికగ్నిషన్ స్కానింగ్ చేసి, వారిని క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి భక్తులు గంటలోపే శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఈ టోకెన్ల జారీ కోసం టీటీడీ (TTD) 45 కౌంటర్లు ఏర్పాటు చేయనుందట.
అలాగే దీనికోసం భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని టీటీడీ భావిస్తోంది. ఇప్పటికే నాలుగు విదేశీ ఏఐ కంపెనీలు టీటీడీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకొచ్చాయట. ఈ ప్రక్రియ కనుక విజయవంతం అయితే.. ఈ నెల 24న జరగనున్న టీటీడీ (TTD) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.