Pawan Kalyan: రాజకీయాలకు అతీతంగా పల్లె ప్రగతికి కృషి చేస్తున్న ఉపముఖ్యమంత్రి…

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసును గెలుచుకున్నాయి. తనకు పాలనలో అనుభవం తక్కువగా ఉన్నా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానన్న ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణంగా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న నాయకులు ఇలా తమ పరిమితులు బహిరంగంగా చెబుతారు అనడం అరుదు. కానీ పవన్ మాత్రం తన నిజాయితీతో ప్రత్యేకంగా నిలిచారు.
మంగళగిరి (Mangalagiri)లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, గ్రామీణాభివృద్ధి పట్ల తనకు ఉన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. పల్లెలంటే తనకు ప్రాణమని, అందుకే పంచాయతీరాజ్ (Panchayati Raj) శాఖను ఎంచుకున్నానని వివరించారు. గ్రామాల అభివృద్ధిలో రాజకీయ జోక్యాలు ఉండకూడదని, అందరినీ సమానంగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (JanaSena), భారతీయ జనతా పార్టీ (BJP) కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నేతృత్వంలో ఏర్పాటు కాగా, పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖలు లభించాయి.
పల్లెల్లో రాజకీయ ప్రభావం లేకుండా అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని పవన్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 70 నుంచి 80 శాతం పంచాయతీలలో వైసీపీ (YSRCP)కి చెందిన సర్పంచులే ఉన్నా, ఆ గ్రామాలను కూడా ఇతర గ్రామాల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. “గ్రామం గ్రామమే, సర్పంచ్ సర్పంచే” అన్న నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రతి పల్లెకు స్వతంత్ర దినోత్సవం , గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.10 వేలు లేదా రూ.25 వేలు మంజూరు చేస్తూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పడుతున్నామని వివరించారు. పాలనలో అనుభవం తక్కువగా ఉన్నా, శాఖలో పైరవీలకు తావు లేకుండా చూసానని చెప్పారు. అధికారులు తన మాటను గౌరవిస్తున్నారని, అవసరమైతే కఠిన చర్యలకు కూడా వెనుకాడబోనని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.