TDP vs YSRCP: టీడీపీ వర్సెస్ వైసీపీ, సింగయ్య కేసులో తప్పు ఎవరిది అన్నట్టు..?

ఆంధ్రప్రదేశ్ లో సింగయ్య మృతి కేసు సంచలనంగా మారిన నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై ఒరిజినల్ వీడియో నిన్న బయటకు వచ్చిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు అది ఫేక్ వీడియో అంటూ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆధారాలతో కౌంటర్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. సింగయ్యను ఆటోలో తీసుకెళ్లారా, అంబులెన్స్‌లో తీసుకెళ్లారా? అనే ప్రశ్నకు.. టీడీపీ సమాధానం ఇచ్చింది.
గుంటూరు బైపాస్‌లోని ఏటుకూరు సర్వీస్ రోడ్ నుండి సింగయ్యను మొదట ఆటోలో తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అయితే, ఇంతలో అంబులెన్స్ రావడంతో అందులో తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లడం సరైనదా, అంబులెన్స్‌లో తీసుకెళ్లడం సరైనదా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నామని కౌంటర్ ఇచ్చింది. అది ఏఐ వీడియోనా అనే ప్రశ్నకు గానూ.. వీడియో ఏఐ ద్వారా రూపొందించినది.. AI ని అడిగితే నిజం చెబుతుందని.. అది AI వీడియో అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ఒక ట్వీట్(Tweet) వేయమనండని మరో కౌంటర్ ఇచ్చింది.
ముందుగా, ఆ సమయంలో సాక్షి ఎందుకు లైవ్ ఆపేసిందో అడగండని.. 14 ఏళ్లుగా జగన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పోలీసుల ముందు “అవును, మా కారు గుద్దింది” అని ఒప్పుకున్నాడని తెలిపింది. రోప్ పార్టీ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు.. రోప్ పార్టీ, భారీ బందోబస్తు అన్నీ సత్తెనపల్లి మొదట్లోనే ఏర్పాటు చేశారు. కానీ, జగన్ పర్మిషన్ లేకుండా దారిపొడవునా వైసీపీ నాయకులకు చెప్పి 2వేలు, 3వేల మంది జనసమీకరణ చేసి, వారికి అభివాదం చేస్తూ ప్రదర్శన చేస్తూ కారు కింద వేసి సింగయ్యను చంపేశారని ఆరోపించారు.
ఇక జగన్ కు సంబంధం లేదని, అయినా కేసు నమోదు చేసారని వైసీపీ ఆరోపించగా, సలు జగన్‌కు పోలీసులు పరిమితమైన పర్మిషన్ ఇచ్చారు. ర్యాలీలు, జనసమీకరణలు దారి పొడవునా వద్దు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అని పోలీసులు ముందే చెప్పారని, కానీ వాటిని పక్కనపెట్టి, భారీ ర్యాలీ చేస్తూ, జనసమీకరణ చేసి, బయటికి వచ్చి అభివాదం చేస్తూ, కారు ఎక్కించి సింగయ్య చావుకు కారణమయ్యారని టీడీపీ మరో కౌంటర్ ఇచ్చింది. అందుకే జగన్ మీద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసు పెట్టారనేది టీడీపీ వాదన.