Talliki Vandanam: తల్లికి వందనం కూటమి కంటే టీడీపీకే ప్లస్..?

తల్లికి వందనం(Talliki Vandanam) కార్యక్రమం విషయంలో వైసిపి గత ఆరు నెలల నుంచి తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో దీనిపై కూటమి పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా టిడిపి(TDP) నాయకులు వీటి గురించి ఎన్నికల ప్రచారంలో గట్టిగా మాట్లాడారు. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ 15 వేల రూపాయలను జమ చేస్తామని అప్పట్లో టిడిపి నేతలు ప్రచారం చేశారు. ఇక కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయకపోవడంతో వైసిపి పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇక వైసిపి చేసిన కామెంట్లు కూడా ప్రజల్లోకి బలంగానే వెళ్లేవి. అయితే రెండు మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని రాబోయే విద్యా సంవత్సరానికి అమలు చేస్తామని చంద్రబాబునాయుడు చెబుతూ వచ్చారు. చెప్పినట్లుగానే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిని కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కూడా సక్సెస్ అయ్యారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా వినపడుతున్నాయి.
వీడియోల రూపంలో అలాగే పోస్టుల రూపంలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. అయితే ఇది కూటమిలోని జనసేన లేదంటే బిజెపి పార్టీలకంటే టిడిపికి ఎక్కువగా కలిసి వచ్చింది అనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కావడం.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావడంతో దీన్ని టిడిపి కార్యకర్తలు ప్రజలకు బలంగా తీసుకువెళ్లడానికి తీవ్రంగా కష్టపడ్డారు. ఇక జగన్(YS Jagan) కూడా విమర్శలు చేసే విషయంలో టిడిపి నే ఎక్కువగా టార్గెట్ చేశారు. దీనితో ఈ కార్యక్రమం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని చెప్పాలి. జనసేన(Janasena), బిజెపి కంటే కూడా టిడిపికి ఒకరకంగా నూతన శక్తిని ఈ కార్యక్రమం ఇచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా అమలు కానున్న నేపథ్యంలో అది కూడా టిడిపికి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది.