Pithapuram: ఇసుక అక్రమ రవాణాపై వర్మ తీవ్ర ఆరోపణలు – పార్టీ నేతలపై అసహనం

పిఠాపురం (Pithapuram) నియోజకవర్గ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన పరిణామాలతో వాతావరణం వేడెక్కింది. జనసేన (Janasena) తరపున ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కల్పించేందుకు వెనుకబడిన వర్మ (Varma) ఇప్పటికీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని.. ఆశించిన పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ కేడర్ లో కూడా ఆయనకు అంతగా గుర్తింపు లేకపోవడం ఆయన మనోవేదనకు కారణమైంది.
ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీ (Janasena Plenary) సమావేశంలో నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలు వర్మను తీవ్రంగా బాధించాయి. అందుకే ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని బహిరంగంగా వెల్లడించాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ వచ్చేలా పరిస్థితులు మలుచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇది స్థానికంగా సంచలనానికి దారితీసింది.
ఇసుక అక్రమ రవాణాపై వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు చిన్నగా మట్టి తవ్వితే స్టేషన్ లో నాలుగు రోజులు ఉంచే పోలీసులకు భారీగా ఇసుక తరలిస్తున్నవారి విషయం మాత్రం కళ్ళు మూసుకొని ప్రవర్తించడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు. పోలీసులకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దృష్టి వస్తుందని.. అనవసరం అనుకున్నప్పుడు రేచీకటి వస్తుందని ఎద్దేవా చేశారు. రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఈ సమస్యలపై ముందే హెచ్చరించినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఆయన ప్రభుత్వ యంత్రాంగానికి పలు మార్లు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని చెప్పారు. ప్రతీరోజూ సుమారు 200 లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతున్నాయని వర్మ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దొరబాబు (Dorababu) అనే మాజీ వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసినవిగా రాజకీయంగా వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి. దొరబాబు మద్దతుదారులు, జనసేన పేరుతో ఇసుక తవ్వకాల్లో పాల్గొంటున్నారని టీడీపీ (TDP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సమానంగా ప్రాధాన్యత ఇచ్చే విధానం వర్మకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వేదికలపై ఓపెన్‌గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రభుత్వంలోని కీలక నాయకుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అన్న చర్చకు దారి తీస్తోంది.