Peddireddy: బుగ్గమఠం భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో..!!

తిరుపతి బుగ్గ మఠం భూముల (Buggamatham Lands) వివాదం రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. హైకోర్టు (AP High Court) సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు (Supreme Court) కీలక దేశాలిచ్చింది. ఈ భూములపై రెండు వారాలపాటు యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసును విచారించి, చట్టపరంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించింది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై 36 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఇందులో 3.88 ఎకరాలు బుగ్గ మఠం భూములని గుర్తించారు. ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించింది. అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేసుల నమోదు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ లోపే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ అంశంపై హైకోర్టును ఆధేశించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణను జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం చేపట్టింది. పిటిషనర్ పెద్దిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్ర హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రెండు వారాలపాటు బుగ్గ మఠం భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ కాలంలో భూములపై ఎలాంటి లావాదేవీలు లేదా మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసును మళ్లీ విచారించి, చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను డివిజన్ బెంచ్ పరిశీలించాలని నిర్దేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసును త్వరలో విచారణకు స్వీకరించనుంది. హైకోర్టు తీర్పు ఈ వివాదానికి ముగింపు పలుకుతుందా లేక మరింత సంక్లిష్టతను తెస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ కేసు రాష్ట్ర భూ నిర్వహణ విధానాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. వైసీపీ నేతలు మాత్రం పెద్దిరెడ్డికి ఊరట లభించిందని చెప్పుకుంటున్నారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిపై సమగ్రంగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అన్ని వివరాలూ బయటికొస్తాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. పెద్దిరెడ్డి తన అక్రమాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు.