Jagan: సమరభేరి యాత్ర..వైసీపీకి నూతన జోష్ నింపే జగన్ కొత్త ప్రణాళిక..

వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తిరిగి ప్రజల మధ్యకు రావాలన్న సంకల్పం చేసినట్టు తాడేపల్లి (Tadepalli) రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జగన్, ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయం పట్ల ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నోసార్లు ప్రజల మద్దతు కోసం వారిని కలవాలని ప్రకటించినా, వాస్తవంగా మాత్రం అలాంటి కార్యక్రమాలు వాయిదాపడ్డాయి. ఈ కారణంగా పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొనిందని పలువురు నేతలు చెబుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎదురు దాడి చేసి ప్రజలలో వైసిపి పై తిరిగి భరోసా పెంచాల్సిన అవసరం ఎంత ఉంది.
ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు ప్రజల్లోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన పర్యటనల ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపవచ్చునని, కోల్పోయిన మద్దతును తిరిగి పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆయన తాజా పర్యటనకు ‘సమరభేరి (Samara Bheri)’ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై పాట్లు పోతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నేతల అరెస్టులు కూడా జరిగాయి. ఇది పార్టీలో ఆందోళనకు దారితీసింది. అలాంటి పరిస్థితుల్లోనే జగన్ కొత్త రీతిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల తరువాత కొంతమంది ముఖ్య నాయకులు పార్టీని వీడి వెళ్లిపోవడం, అలాగే కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గిపోవడం వల్ల పార్టీ గాడిలో పడే పరిస్థితి లేదన్న వాదన ఉంది.
ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా పార్టీని తిరిగి బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. గతంలో కడప (Kadapa), ప్రకాశం (Prakasam), గుంటూరు (Guntur) జిల్లాల్లో కొంతమంది రైతులను మాత్రమే పరామర్శించిన జగన్, ఇకపై వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ సమరభేరి యాత్ర ఇంకా నెలరోజుల తర్వాతే ప్రారంభం కానుందని తెలిసింది. అయినా పార్టీకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి. మరి ఈ యాత్రకు సంబంధించిన పర్మిషన్లకు కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఒకే చెబుతుంది అన్నది వేచి చూడాలి..