Phone Tapping: ఏపీ లీడర్ల ఫోన్లూ ట్యాప్ చేశారా..?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్‌ల (Nara Lokesh) ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం ఉంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో పెద్దఎత్తున ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో దానిపై విచారణకు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ద్వారా ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో మాజీ SIB చీఫ్ టి.ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికాకు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల ఆయన కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు తిరిగొచ్చి విచారణకు హాజరయ్యారు.
తాజాగా, ఈ కేసులో దాదాపు 4,500 ఫోన్లను కేవలం 15 రోజుల్లో ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన సుమారు 1,000 మంది రాజకీయ నాయకుల ఫోన్లు ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల ఫోన్‌ను రహస్యంగా, కోడ్ భాషలో ట్యాప్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే, చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు నిందితులు అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆయన ఆరోపించారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అధికారులపై చార్జిషీట్ దాఖలైంది. వీరిలో సస్పెండ్ అయిన DSP డి.ప్రణీత్ రావు, అడిషనల్ SPలు భుజంగ రావు, తిరుపతన్న, మాజీ DCP రాధాకిషన్ రావు ఉన్నారు. ప్రణీత్ రావు ఎన్నికల తర్వాత డేటాను నాశనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భుజంగ రావు, రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభాకర్ రావు ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి విచారణకు హాజరవుతున్నారు.
ఈ కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రాజకీయ దుమారం రేపింది. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఈ వ్యవహారంపై CBI విచారణకు డిమాండ్ చేశారు. షర్మిల ఫోన్ ట్యాపింగ్ విషయం వైఎస్ఆర్సీపీకి సమస్యగా మారింది. అటు టీడీపీ కూడా వైసీపీపై వేలెత్తి చూపుతోంది., ఈ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్‌తో పాటు వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఏపీ నేతలు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య మరింత రచ్చ రాజేసే అవకాశముంది.