Pawan Kalyan: ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎమ్మెల్యేలు తలనొప్పి తెచ్చి పెడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అధికార పార్టీల పరువు పోతూ ఉంటుంది. ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి పరిస్థితి అలాగే ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం అధికార పార్టీలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కూడా సీరియస్ అయ్యారు. కొన్ని అనవసర విషయాల్లో ఎమ్మెల్యేలు జోకులు చేసుకుంటున్నారని చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు.
కొంతమంది ఎమ్మెల్యేలు నోరు జారటం, అలాగే సివిల్ తగాదాల్లో తల దూర్చడం, కబ్జాల వ్యవహారాల్లో ఉండటం వంటివి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన(Janasena) అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. విశాఖలో జరిగిన పార్టీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాల్లో ఉన్నా లేదంటే.. అనుమానాస్పద వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే జనసేన పార్టీ మంత్రులు కూడా రిఫరెన్స్ లేఖలు ఇచ్చే సమయంలో జాగ్రత్త పడాలని, నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ఒకటికి పది సార్లు ఆలోచించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పి తీసుకొచ్చే పనులు చేయవద్దని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
అలాగే ఎమ్మెల్యేలు కూడా తిరుమల దర్శనాల విషయంలో గానీ, ఇసుక అక్రమ రవాణా విషయంలో గానీ, ఇతర వ్యవహారాల విషయంలో గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మాత్రం, ఏ సమయంలోనైనా సరే సస్పెండ్ చేస్తాను అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారట. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలతో గానీ, బీజేపీ నేతలతో గాని ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలని, సొంత నిర్ణయాలు తీసుకోవడం గానీ, సొంతగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గాని చేయవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అలాగే ఎమ్మెల్యేలు ఎవరైనా మీడియాతో మాట్లాడాలి అనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే పార్టీ నాయకత్వానికి పంపించాలని, ఆ తర్వాతనే మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని.. కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫోటోలు దిగే వ్యక్తులతో కూడా ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రోటోకాల్ విషయంలో కూడా వివాదాస్పదంగా వ్యవహరించవద్దని స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.







