YS Jagan: జగన్ పల్నాడు పర్యటనలో విషాదం.. ఇద్దరు మృతి..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) మండలం రెంటపాళ్ల (Rentapalla) పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ పర్యటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వైసీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వైసీపీ నేతలు అడుగడుగునా ఆంక్షలను ఉల్లంఘించారని పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు పోతున్నా జగన్ మాత్రం పట్టించుకోకుండా పర్యటించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
జగన్ రెంటపాళ్ల పర్యటన ఆద్యంతం హడావుడిగా సాగింది. తాడేపల్లి నుంచి బయలుదేరిన కాసేపటికే ఓ వాహనం లింగయ్య అనే ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయారు. జగన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఆ తర్వాత సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఈ రెండు మరణాలు స్థానికులను, వైసీపీ కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. జగన్ ఈ పర్యటనలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త, మాజీ డిప్యూటీ సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.
పల్నాడు జిల్లా పోలీసులు జగన్ పర్యటనకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. కేవలం మూడు వాహనాలు, 100 మంది కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో జగన్ పోడిలి పర్యటనలో జరిగిన రాళ్ల దాడులు, ఘర్షణల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లతో వందలాది కార్యకర్తలు జగన్ కాన్వాయ్‌తో రెంటపాళ్లకు చేరుకున్నారు. పల్నాడు ఎస్పీ కొంచి శ్రీనివాసరావు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు.
వైసీపీ నాయకులు పోలీసులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రాజిని, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌చార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగన్ జనాదరణకు భయపడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తల మరణాలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు.
టీడీపీ నాయకులు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కాన్వాయ్‌లో అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని, బాధ్యత వహించి క్షమాపణ చెప్పకుండా జగన్ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌ను రాజకీయ సర్కస్ సృష్టించి, ప్రమాద స్థలం నుంచి పరారయ్యారని ఓ కార్యకర్త విమర్శించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఇలాంటి హడావిడి అవసరమా అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ పర్యటనల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయం చేశారని వారు గుర్తు చేశారు.
ఈ ఘటన వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. వైసీపీ నాయకులు ప్రభుత్వం, పోలీసులను లక్ష్యంగా చేసుకోగా, టీడీపీ నాయకులు జగన్ వైఖరిని తప్పుబట్టారు. రెండు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమైనప్పటికీ, రాజకీయ పార్టీలు దీనిని తమ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.