Polavaram: జిల్లాల పునర్విభజనతో ఏపీలో కొత్త సమీకరణలు.. పోలవరం జిల్లాలో పోలవరం మిస్..
“మైసూరు బోండాలో మైసూరు ఉండదు” అన్న సామెతను గుర్తు చేసేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఒక కొత్త చర్చ మొదలైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయంతో “పోలవరం జిల్లా (Polavaram District)లో పోలవరం ఊరే లేకపోవడం ఎలా?” అనే ప్రశ్న ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయం సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోదం పొందడంతో రాజకీయంగా, పరిపాలనపరంగా విస్తృత చర్చకు దారితీసింది.
మంత్రివర్గ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరగగా, జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో సరిహద్దులు, మండలాలు, డివిజన్లలో మార్పులు చేయనున్నారు. మిగిలిన 9 జిల్లాలు ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగనున్నాయి.
ఈ నిర్ణయాల్లో అన్నమయ్య జిల్లా (Annamayya District) కేంద్రం మార్పు ఒక అంశంగా నిలవగా, పోలవరం జిల్లాలో పోలవరం గ్రామం లేకపోవడం మరింత చర్చకు దారి తీసింది. దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రంపచోడవరం (Rampachodavaram) కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పోలవరం జిల్లా పేరు ఉన్నప్పటికీ పోలవరం గ్రామం ఏలూరు జిల్లా (Eluru District)లోనే కొనసాగడంపై విలేకరులు ప్రశ్నించగా, మంత్రి ఆసక్తికర ఉదాహరణ ఇచ్చారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు (Nimmakuru) కృష్ణా జిల్లా (Krishna District)లో ఉన్నప్పటికీ, విజయవాడ (Vijayawada) కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో నిర్వాసిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లాకు పేరు పెట్టడం పరిపాలనా అవసరాల కోసమేనని వివరించారు.
ప్రజల నుంచి వచ్చిన సూచనలు, ఫిర్యాదుల ఆధారంగా కొన్ని మండలాలు, డివిజన్లను మార్చామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా జిల్లాలను విభజించడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయని, ఆ లోపాలను ఇప్పుడు సరిదిద్దుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా స్పందిస్తూ, అప్పట్లో పారదర్శకంగా విభజన జరిగి ఉంటే ఇలాంటి గందరగోళం ఉండేదే కాదన్నారు.
జిల్లా కేంద్ర హోదా కోల్పోతున్న రాయచోటి (Rayachoti) పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రామప్రసాద్ (Mandipalli Ramprasad)కు ఈ నిర్ణయాలపై ముందుగానే వివరించామని తెలిపారు. మొత్తంగా ఈ మార్పులన్నీ రాజకీయ లాభాల కోసం కాకుండా, పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవల కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.






