Nara Lokesh: ప్రజల సమస్యలపై తక్షణ స్పందనతో మరోసారి నిబద్ధత చాటిన లోకేష్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల చోటుచేసుకున్న పలాస (Palasa) ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని కాశీబుగ్గ (Kashibugga) లో కార్తీక మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఇటీవల రెండు నెలలుగా మంత్రి నారా లోకేష్ వివిధ పర్యటనలు, తుఫానులు, వర్షాలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. కాస్త విరామం తీసుకుని కుటుంబంతో గడపాలని భావించి శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) కు వెళ్లారు. అయితే శనివారం ఉదయం కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట వార్త తెలిసిన వెంటనే బయలుదేరిన లోకేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కార్తీక మాసం తొలిశనివారం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఆలయంలో దాదాపు రెండు వేల మందికే దర్శనానికి అవకాశం ఉన్నప్పటికీ, ఈసారి అనూహ్యంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆ సమయంలో ఒక భక్తుడు ఉపవాసం కారణంగా అకస్మాత్తుగా కుప్పకూలడంతో భయం నెలకొంది. దీంతో క్యూలో ఉన్న ప్రజలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది భక్తులు స్పృహ తప్పగా, పలువురు గాయపడ్డారు.
సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వారిని చూసి, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయాలని కూడా సూచించారు.
ఇక లండన్ (London) లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఈ ఘటనపై నిరంతరం సమాచారం సేకరిస్తున్నారు. ఆయన అధికారులకు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని సూచించారు. గాయపడినవారికి అత్యవసర వైద్యం అందించాలని, ఏ విధంగానూ నిర్లక్ష్యం జరగరాదని ఆదేశించారు.
మంత్రి నారా లోకేష్ నేరుగా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడం, వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడం ప్రజల్లో ఆదరణను తెచ్చిపెట్టింది. రాజకీయ బాధ్యతతో పాటు మానవతా దృక్పథంతో వ్యవహరించిన లోకేష్ పట్ల ప్రజలు కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గ ఘటన బాధాకరమైనదైనా, ప్రభుత్వ స్పందన వేగంగా ఉండటం కొంత ఊరటనిస్తోంది. సీఎం చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పటికీ, ఆయన సూచనలతో ప్రభుత్వం సమయానుకూల చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది.







