Nara Lokesh: కార్యకర్త కుటుంబానికి ఆర్థిక అండ..మాట నిలబెట్టుకున్న లోకేష్..

పల్నాడు జిల్లా (Palnadu District) రొంపిచర్ల (Rompicherla) మండలం అలవాల (Alaval) గ్రామానికి చెందిన వెన్నా బాల కోటిరెడ్డి (Venna Bala Kotireddy) పార్టీకి సేవలందించిన నేతగా తెలుగుదేశం కార్యకర్తలకు సుపరిచితమే. నాలుగు దశాబ్దాలుగా టీడీపీ పట్ల అంకితభావంతో పని చేసిన ఆయన పార్టీకి నిరంతరం సేవలందించారు. రొంపిచర్ల మండలానికి అధ్యక్షుడిగా, ఎంపీపీగా పనిచేసిన ఆయన కొంతకాలం క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
ఆ ఘటన తరువాత వెన్నా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆయన సతీమణి నాగేంద్రమ్మ (Nagendramma) , కుమారుడు ఇటీవల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. ఇంటిపై రుణభారం ఉండటంతో పాటు, ఆదాయ మార్గం లేక జీవితం నెట్టుకుంటున్నామని వారు కన్నీటితో వివరించారు.
ఆ కుటుంబ పరిస్థితిని విన్న లోకేష్ స్పందన ఎంతో మానవీయంగా కనిపించింది. ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల తన మాటను నిలబెట్టుకుంటూ, వారికి ఉన్న ఇంటి రుణాన్ని వడ్డీతో సహా పూర్తిగా తీర్చించారు. అంతే కాకుండా, నాగేంద్రమ్మకు నెలవారీ ఆదాయం వచ్చేలా, ప్రభుత్వ పింఛనుతో పాటు, పార్టీ తరఫుననూ నెలనెలా ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా ఆ కుటుంబం తక్షణ అవసరాలు తీర్చేందుకు రూ.1 లక్ష నగదు సహాయం అందించారు. దీనితో పాటు, ఏ అవసరమైనా పార్టీ వారికోసం నిలుస్తుందని, అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు. ఈ సహాయానికి కుటుంబం హృదయపూర్వకంగా స్పందిస్తూ తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి సంఘటనల్లో పార్టీకి జీవితం అంకితం చేసిన కార్యకర్తల కుటుంబాలను మర్చిపోకూడదని, వారికి అండగా ఉండటం ప్రతి నాయకుడి బాధ్యత అని లోకేష్ తన చర్యల ద్వారా ప్రదర్శించారు. ఇది పార్టీ కార్యకర్తలకు ప్రోత్సాహకరంగా, భరోసాగా నిలుస్తోంది. మరెందరో పార్టీకి సేవలందించినవారికి ఇది ఒక మంచి ఉదాహరణగా మారుతుందని అనిపిస్తోంది.