Nara Lokesh: లోకేష్ ఢిల్లీ టూర్, చెవిరెడ్డి కొలంబో టూర్, సెన్సేషన్ కమింగ్ సూన్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(liquor scam) ఏ మలుపు తిరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కుంభకోణంలో కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. గత పది రోజుల నుంచి మద్యం కుంభకోణంలో ఎటువంటి వార్తలు పెద్దగా మీడియాలో రావడం లేదు. అరెస్టు అయిన కొంతమంది వ్యక్తుల నుంచి రాబట్టిన సమాచారం ప్రకారం త్వరలోనే కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు కొంతమందిని అరెస్టు చేయవచ్చని ప్రచారం జరిగింది.
ఈ టైం లో ఒక కానిస్టేబుల్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ సంచలనంగా మారింది. తనతో బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. ఇక ఆ లేఖ తర్వాత జరిగిన ఓ పరిణామం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉండగా బెంగళూరులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. లిక్కర్ కుంభకోణంలో ఆయనకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ అయ్యాయి.
అయితే ఇదంతా మంత్రి లోకేష్(Nara Lokesh) ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన సమయంలోనే జరగటం ఆసక్తిని రేపుతోంది. లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అనే వార్తలు రాగానే త్వరలో రాష్ట్రంలో అరెస్టులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. ముఖ్యంగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్టులు ఉండొచ్చని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి తో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. వీరిలో ప్రభుత్వ అధికారులు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి లోకేష్ ఢిల్లీ పర్యటన తర్వాత ఇంకేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది చూడాలి.