Jagan: భూ కేటాయింపులపై జగన్ ఆగ్రహం ..కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తాజాగా తాడేపల్లిలో (Tadepalli) స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విశాఖపట్నం (Visakhapatnam) లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ప్రైవేటు కంపెనీలకు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. ఉర్సా అనే కంపెనీకి (Ursa Clusters Pvt. Ltd) రూ.3000 కోట్ల విలువైన భూమిని కేవలం రూపాయి ధరకు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత పెద్ద మొత్తంలో భూమిని దోచిపెట్టడం అన్యాయమని అన్నారు.
అదేవిధంగా, లులు మాల్ (Lulu Mall) నిర్మాణానికి సంబంధించి రూ.1500 కోట్ల విలువైన భూమిని టెండర్లు లేకుండా కేటాయించడాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఇది పారదర్శకతకు భిన్నంగా ఉందని, ప్రజాధనాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా, దృష్టిమళ్లింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బెల్టుషాపులు, మద్యం దుకాణాలు బాగా పెరిగాయని, మద్యం విక్రయాలపై ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడమే ధ్యేయంగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రతి మద్యం సీసాపై అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని చెప్పారు. ఉచిత ఇసుక పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్య, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పింఛన్లను కూడా భారీగా తొలగించడం వల్ల పెద్దఎత్తున వృద్ధులు, నిరుపేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్వరం ఎత్తే అవకాశం ఇవ్వకుండా టీడీపీ (TDP ) ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నదని, ఇది సాధ్యం కాదని చెప్పారు. గ్రామాల్లో టీడీపీ నేతలు తిరగలేకపోతున్న పరిస్థితి ప్రజలు తమ పాలన గుర్తు చేసుకుంటున్నారు అనడానికి నిదర్శనమని అన్నారు. అలాగే జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir) లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి జగన్ నివాళులర్పిస్తూ రెండు నిమిషాల మౌనప్రార్థన నిర్వహించారు. విశాఖలో భూ కేటాయింపులపై రాజకీయంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో, మాజీ సీఎం స్వయంగా ఈ విషయంపై స్పందించడం రాజకీయంగా కీలకంగా మారింది.