IBM: అమరావతి భవిష్యత్తుకు కొత్త దశ.. ఐబీఎం క్వాంటం వ్యాలీ ప్రారంభం..

అమరావతిలో (Amaravati) దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటరింగ్ సెంటర్ (Quantum Computing Center) స్థాపనకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) ఈ కేంద్రాన్ని వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించబోతోందని సంస్థ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ (Scott Crowder) ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా మారబోతోందన్న ఉత్సాహం పెరిగింది.
గత ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) “క్వాంటం వ్యాలీ” (Quantum Valley) ఏర్పాటును ప్రకటించారు. హైదరాబాద్ (Hyderabad) లోని హైటెక్ సిటీ తరహాలో అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ నిర్మించడానికి 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీనికి దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ (TCS), నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ఎల్ అండ్ టీ (L&T) తో ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఐబీఎం నేరుగా అడుగుపెట్టడం విశేషంగా భావిస్తున్నారు.
భారతదేశానికి ఇది ఒక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. అమరావతిలో ఏర్పాటు కాబోయే టెక్ పార్క్‌లో ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2 (IBM Quantum System-2) ను ఇన్‌స్టాల్ చేయడానికి ఐబీఎం–టీసీఎస్ భాగస్వామ్యం కుదిరింది. ఈ సెంటర్ ద్వారా భారత్ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్‌లో బలమైన స్థానం సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐబీఎంకు అమెరికా (USA), జపాన్ (Japan), దక్షిణ కొరియా (South Korea), కెనడా (Canada), స్పెయిన్ (Spain) వంటి దేశాల్లో తొమ్మిది కేంద్రాలు ఉన్నాయి. తాజాగా భారత్ (India) ను కూడా ఆ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ అమలులోకి రావడం వల్ల అమరావతిపై ఆశలు మరింతగా పెరిగాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం సంపద, పెట్టుబడులు పెరగాలనే దృష్టితో సీఎం చంద్రబాబు నాలెడ్జ్ ఎకానమీపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తెలుగు యువత ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో వారికి కొత్త అవకాశాలను కల్పించేందుకు అమరావతిలో పలు టెక్నాలజీ సెంటర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక విశాఖపట్నం (Visakhapatnam) ఐటీ అభివృద్ధి కేంద్రంగా, అమరావతిని హైటెక్ టెక్నాలజీల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం విడుదలైన ఐబీఎం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలితాలివ్వడం ప్రారంభించాయని భావిస్తున్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం స్థాపనతో దేశంలోని తొలి అడ్వాన్స్‌డ్ టెక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఒకవైపు సాంకేతిక రంగంలో కొత్త దారులు తెరుచుకోగా, మరోవైపు గ్లోబల్ కంపెనీల దృష్టి రాష్ట్రంపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి, అమరావతిలో ఐబీఎం ప్రారంభించబోయే ఈ కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారత్ టెక్నాలజీ భవిష్యత్తుకు కూడా కీలక మలుపు కానుందన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతోంది.