Chevireddy Bhaskar Reddy: లిక్కర్ స్కాం విచారణకు ముందే గుండెనొప్పి డ్రామా? చెవిరెడ్డిపై అనుమానాలు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రస్తుతం విజయవాడ (Vijayawada) సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. లిక్కర్ స్కాంలో ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. బెంగళూరు (Bengaluru) నుంచి శ్రీలంక (Sri Lanka) వెళ్లే సమయంలో ఆయనను ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు చెవిరెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలన్న ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా పిటిషన్ సిద్దం చేసి, ఏసీబీ కోర్టులో (ACB Court) దాఖలు చేశారు.
అయితే ఈ వ్యవహారానికి ఊహించని మలుపు వచ్చిందని చెప్పవచ్చు. శనివారం మధ్యాహ్నం జైలులో ఉన్న చెవిరెడ్డి తనకు గుండెపోటు వస్తోందని జైలు సిబ్బందికి తెలియజేశారు. గుండెల్లో మంటగా ఉందని, తీవ్రమైన నొప్పి అనిపిస్తోందని చెప్పారు. దీంతో జైలు అధికారులు అప్రమత్తమై, వెంటనే వైద్యులను పిలిపించారు. జైలు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, గుండెపోటు లక్షణాలు లేవని నిర్ధారించారు. అయినా కూడా చెవిరెడ్డి ఆసుపత్రికి తరలించాలని బలంగా కోరడంతో అధికారులు ఆయనను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు.
ఆసుపత్రిలో పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు ఇది హృదయ సంబంధిత సమస్య కాదని, సాధారణంగా గ్యాస్ కారణంగా వచ్చే నొప్పిగా అంచనా వేశారు. అయినప్పటికీ చెవిరెడ్డి తాను అనుభవిస్తున్న నొప్పి తీవ్రంగా ఉందని, తన పరిస్థితి సరిగా లేదని పదేపదే చెబుతూ ఉన్నారని పోలీసులు తెలిపారు. దీని వల్ల అధికారులు కొంత గందరగోళానికి లోనయ్యారు. చివరకు శనివారం రాత్రివరకు చెవిరెడ్డిని ఆసుపత్రిలోనే ఉంచారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చెవిరెడ్డి ఈ ఆరోగ్య సమస్యను కస్టడీ విచారణకు తప్పించుకునే ఉద్దేశంతోనే చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు అధికారులు ఈ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. ఎంతటివారైనా విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తదుపరి ప్రక్రియ ఎలా జరుగుతుందన్నదానిపై ఆసక్తికరంగా మారింది.