Vishakhapatnam: గూగుల్, రైడెన్ భారీ పెట్టుబడులతో విశాఖలో ఐటీ విప్లవంకు నాంది పలుకుతున్న కూటమి..

విశాఖపట్నం (Visakhapatnam) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజ సంస్థలు విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే గూగుల్ (Google) ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, మరో ప్రముఖ సంస్థ సిఫీ (Sify) కూడా సుమారు 16 వేల కోట్లతో డేటా సెంటర్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతులు పొందింది. ఇప్పుడు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Raiden Infotech India Private Limited) విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
రైడెన్ సంస్థ దాదాపు రూ. 87,250 కోట్ల భారీ పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తోంది. మొదటి దశను వచ్చే రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేయాలని ప్రణాళిక వేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖలో వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. గూగుల్ కూడా రూ. 52 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తుండడంతో విశాఖ అంతర్జాతీయ స్థాయి ఐటీ హబ్‌గా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైడెన్ సంస్థ మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తర్లువాడ (Tarluwada) లో 200 ఎకరాలు, రాంబిల్లి (Rambilli)–అచ్యుతాపురం (Achyutapuram) ప్రాంతాల్లో 160 ఎకరాలు, అడవివరం (Adavivaram) వద్ద 20 ఎకరాలు కేటాయించాలని సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు లభించిన వెంటనే 2026 మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభించి, 2028 జూలై నాటికి మొదటి దశను పూర్తి చేయాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఈ మూడు సెంటర్లకు దాదాపు 2100 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, అవసరమైన విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం.
రైడెన్ సంస్థ సింగపూర్ (Singapore) కు చెందిన గూగుల్ అనుబంధ కంపెనీ. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలో కూడా ఉంది. ప్రభుత్వం నిర్వహించిన సమావేశాల్లో ఈ వివరాలను సంస్థ అధికారులు స్పష్టంగా తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఐటీ రంగంలో నూతన దశ ప్రారంభమవుతుందని విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర (Uttarandhra) యువత ఉద్యోగాల కోసం బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad) వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు విశాఖలో ఐటీ సంస్థలు స్థాపించడంతో స్థానికంగా అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామాలు ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తంగా విశాఖ ఐటీ రంగంలో గ్లోబల్ మ్యాప్ మీద నిలిచే దిశగా పయనిస్తోంది.