AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మొదటి బెయిల్.. ఎవరిదో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తున్న అంశం లిక్కర్ స్కాం (Liquor Scam)కేసు. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ కాలంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడపగా, ఆ సమయంలో దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత టీడీపీ (TDP) కూటమి ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ (SIT)ను ఏర్పాటు చేశారు. అయితే, ప్రభుత్వం స్వయంగా మద్యం అమ్మకాలు చూసినప్పుడు అవినీతి జరిగే అవకాశం ఎలా ఉంటుందని వైసీపీ (YCP ) ప్రశ్నిస్తోంది. తమ ప్రభుత్వం బెల్టు షాపులను మూసివేసిందని, అమ్మకాల సమయాన్ని తగ్గించిందని, కొత్తగా డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వలేదని వాదిస్తోంది. ఇవన్నీ పట్టించుకోకుండా, తమ నాయకులను వేధించేందుకు తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
ఈ కేసు చుట్టూ మీడియా కథనాలు రెండు వైపులా విస్తరిస్తున్నాయి. అధికార కూటమికి మద్దతుగా ఉండే వార్తా పత్రికలు ఒక రీతిగా, ప్రతిపక్షానికి దగ్గరగా ఉన్న మీడియా మరో రీతిగా కథనాలు రాస్తున్నాయి. కానీ ఇరు వైపులా వచ్చే సమాచారం రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. ఇదిలా ఉంటే, ఎస్ఐటి చేసిన అరెస్టుల్లో వైసీపీకి చెందిన పలు కీలక నాయకులు ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy Ramachandra Reddy) కుమారుడు, రాజంపేట (Rajampet) ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy), జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy), ఓఎస్డీగా పని చేసిన క్రిష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), అలాగే మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
తాజాగా ఈ కేసులో మొదటిసారి బెయిల్ మంజూరైంది. నిందితుడు దిలీప్ (Dileep), 125 రోజుల తర్వాత జైలు నుండి బయటకు రావడానికి అనుమతి పొందారు. ఆయనపై ఎస్ఐటి తగిన ఆధారాలు చూపలేదని, దర్యాప్తు పూర్తైందని లాయర్లు వాదించడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (A1), శ్రీధర్ రెడ్డి (A6) వంటి వారి పిటిషన్లు తిరస్కరించబడ్డాయి.
మిథున్ రెడ్డి తరఫున వేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు కూడా ఇప్పటివరకు సఫలం కాలేదు. వాటిపై విచారణను కోర్టు సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఇదే విధంగా ధనుంజయరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం విచారణ జరగనుంది. క్రిష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa) పిటిషన్లపై కూడా కోర్టు ప్రాసిక్యూషన్‌కి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక బాలాజీ కుమార్ యాదవ్ (Balaji Kumar Yadav) అరెస్టు సమయంలో ఎస్ఐటి స్వాధీనం చేసుకున్న రూ.3 లక్షల కేసుపై కూడా విచారణ జరుగనుంది. ఈ డబ్బు విడుదల చేయాలని ఆయన వేసిన పిటిషన్‌కు బదులుగా, సిట్ మాత్రం ఆ మొత్తాన్ని మద్యం కేసుకు సంబంధించినదిగా పరిగణించాలంటూ వాదిస్తోంది. ఈ అంశంపై వచ్చే సోమవారం తీర్పు వెలువడనుంది.







