బడ్జెట్ లో ఏపీకి శుభవార్త…

2024-25 కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కాస్త ఊరట లభించింది. విభజన సమస్యలతో అష్టకష్టాలు పడుతున్న ఏపీని గట్టెక్కించేలా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు.
వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ..
విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తాం’’ అని నిర్మలమ్మ భరోసానిచ్చారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు.
విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి సర్కార్ నడుస్తుండడం… కూటమి పార్టీల ఎంపీలు వెళ్లి తమ ప్రాధాన్యతలను తెలియజేస్తుండడంతో.. కేంద్రం కూడా తగిన విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈపరిణామం .. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తుందంటున్నారు ఎన్డీయే కూటమి నేతలు.