Nara Lokesh: వైసీపీలో లోకేష్ ఢిల్లీ టూర్ భయం..?

ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ(Delhi) పర్యటనకు వెళుతున్న ప్రతిసారి ఏదో ఒక సంచలనం చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే రాజకీయ వర్గాల్లో జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటం, దానికి తోడు లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అరెస్టు జరగటంతో, ఈసారి కూడా ఏదో ఒక అరెస్టు జరిగే అవకాశాలు ఉండవచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో ఆయన భేటీ కావడం ఆసక్తిని కలిగించింది. లిక్కర్ కుంభకోణంలో విదేశాలకు పారిపోయిన కొంతమంది నిందితులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ అందించినట్లు సమాచారం. వారిని ఇంటర్పోల్ సహాయంతో రాష్ట్రానికి తీసుకురావాలని లోకేష్ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి పక్క ఆధారాలను కేంద్ర విదేశాంగకు లోకేష్ ఇచ్చినట్లు కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి.
గతంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. అంతకుముందు లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరిని అరెస్టు చేయవచ్చు అనేదానిపై క్లారిటీ రావటం లేదు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఈ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఆసక్తిని రేపుతోంది.
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి అలాగే ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్వరలోనే ఈ కేసులో కీలక అడుగులు పడవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సిబిఐ మళ్లీ విచారణను తిరిగి మొదలుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సహకారం కూడా సిబిఐ అధికారులకు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇటీవల సునీత రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆధారాలను కూడా చంద్రబాబుకు సమర్పించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఇది కూడా ఒక కారణమే అనే ప్రచారం మొదలైంది. మరి ఈ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి.