TTD Ghee: తిరుమలకు సప్లై చేసింది అసలు నెయ్యే కాదా..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ అంశంపై విచారణ జరుపుతోంది. అయితే సిట్ విచారణలో విచారణలో అత్యంత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి సరఫరా అయిన నెయ్యి అసలు నెయ్యే కాదని, కేవలం రసాయనాలు కలిపిన నకిలీ ఆయిల్ అని సిట్ నిర్ధారించినట్లు సమాచారం.
నెల్లూరు కోర్టుకు సిట్ తాజాగా రిమాండ్ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ అనే సంస్థ టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. దీని విలువ దాదాపు 250 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డెయిరీ యజమానులు పొమిల్ జైన్, విపిన్ జైన్ తమ ప్లాంట్‌లో ఒక్క చుక్క పాలు లేదా వెన్నను సేకరించకుండానే నకిలీ నెయ్యిని తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరు పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగించి, వాటికి మోనోడిగ్లైసరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, బీటా-కెరోటిన్ వంటి రసాయనాలను కలిపి, ల్యాబ్ టెస్టుల విలువలను తారుమారు చేసి, నెయ్యి వాసన వచ్చేలా చేశారు.
ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో స్పష్టం చేసింది. 2022లో భోలే బాబా డెయిరీ సహా కొన్ని సంస్థలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటెబుల్ ఆయిల్ ఉన్నట్లు మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ (CFTRI) ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ నివేదికను టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం, నాటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా, ఆయన ఆ కంపెనీలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కల్తీ ఆరోపణలున్నా కూడా ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి డెయిరీ వంటి సంస్థలకు నెయ్యి సరఫరా చేసేందుకు వైవీ సుబ్బారెడ్డి అనుమతించారు. భోలే బాబా డెయిరీకి సైతం అక్టోబర్ 2022 వరకు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు (PA) చిన్న అప్పన్నను సిట్ అరెస్ట్ చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చేందుకు కిలో నెయ్యికి రూ.25 కమిషన్‌గా చిన్న అప్పన్న డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. హవాలా ఏజెంట్ ద్వారా 20 లక్షలు, మరో సందర్భంలో 30 లక్షలు సహా మొత్తం 50 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. చిన్న అప్పన్న లంచం డిమాండ్ చేస్తున్నాడని భోలే బాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ స్వయంగా 2022 మే నెలలో హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏడాది పాటు ప్లాంట్‌లో తనిఖీలు నిర్వహించవద్దని కోరినట్లు కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది.
2022లో భోలే బాబా డెయిరీని టీటీడీ బ్లాక్‌లిస్ట్ చేసినప్పటికీ, ఆ సంస్థ ప్రమోటర్లు కుట్ర పన్ని తిరుపతికి చెందిన వైష్ణవి డెయిరీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాల్ గంగా, తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వంటి ఇతర సంస్థల ద్వారా టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. గత ఏడాది జంతు కొవ్వుతో కల్తీ అయినట్లు తేలి టీటీడీ తిరస్కరించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూడా, భోలే బాబా డెయిరీనే సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. ఆ డెయిరీ యజమానులు వేరే చోటకి తరలించి, దాని నాణ్యతను తాత్కాలికంగా మెరుగుపరిచి, వైష్ణవి డెయిరీ ద్వారా తిరిగి టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా తిరస్కరించిన నెయ్యిని కూడా వక్రమార్గంలో తరలించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడినట్లు సిట్ తెలిపింది. కేవలం తిరుమలకు మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ ఆలయం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వంటి ప్రముఖ ఆలయాలకు కూడా ఇదే భోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు సీబీఐ గుర్తించింది.
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన ఈ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసు దర్యాప్తును ఒక కొలిక్కి తీసుకురావడానికి వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంక్ ఖాతాల లావాదేవీల వివరాలను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని సిట్ కోర్టును కోరింది. దర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో, త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.







