Ys Sharmila: షర్మిలకు జగన్ ఛాన్స్ ఇచ్చేసారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నిక వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నిక విషయంలో వైసిపి ఎన్డీఏకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ వైసీపీని టార్గెట్ చేసే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 నుంచి బిజెపికి వైఎస్ జగన్(Ys Jagan) అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి బిజెపికి రాజ్యసభలో లోక్ సభ లో వైసీపీ మద్దతిస్తూ వస్తుంది.
తాజాగా జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బిజెపికి మద్దతు ఇచ్చింది. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. జగన్ వ్యక్తిగత అంశాలతో బిజెపికి దగ్గరగా ఉంటున్నారు అనేది ముందు నుంచి వినపడే ఆరోపణ. 2014 నుంచి దాదాపుగా ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా సరే కీలక సమయాల్లో కూడా జగన్ ఆ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. దీనికి వైసీపీ చెప్తున్న కారణం జగన్ ను 16 నెలలు జైల్లో ఉంచడమే.
అందుకే ఆయన బిజెపికే మద్దతిస్తున్నారు. అయితే తటస్థంగా ఉండే అవకాశం ఉన్నా సరే జగన్ ఉండటం లేదు. ఈ అంశాన్ని షర్మిల టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చు. జగన్ వ్యక్తిగత కేసుల కోసమే బిజెపికి మద్దతు ఇస్తున్నారని ఆమె టార్గెట్ చేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ విషయంలో టిడిపి మాట్లాడకపోయినా కాంగ్రెస్ మాత్రం గట్టిగానే జగన్ ను టార్గెట్ చేయవచ్చు. ఇటీవల ఓటర్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీ పై జగన్ విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చింది.
ఇక ఇప్పుడు.. ఉపరాష్ట్రపతి ఎన్నికలను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ టార్గెట్ చేసే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. దానికి తోడు తెలుగువారిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినా సరే జగన్ దూరంగా ఉండటం కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అటు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది.







