Vizag: 10 లక్షలకోట్లు పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ సీఐఐ సదస్సు..
ఏపీ ముఖచిత్రాన్ని మార్చే, ప్రగతిపథంలో దూసుకెళ్లేలా .. రెండురోజుల పాటు విశాఖలో జరుగుతున్న సీఐఐ (CII) సదస్సు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ 30వ సదస్సులో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు, ఒప్పందాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.
అధికారికంగా సదస్సు ప్రారంభమైన తర్వాత ‘టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. తర్వాత ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏఐ ఎలా దోహదపడుతుందో వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. విశాఖలో లులూ గ్రూప్ నిర్మించనున్న నూతన మాల్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.
కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
సదస్సు చివరి రోజైన శనివారం (15వ తేదీ) కూడా పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా, టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు కూడా ఇదే రోజు శంకుస్థాపన చేయడం విశేషం. అనంతరం బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ దేశాల ప్రతినిధులతో భేటీ అవుతారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్’ను కూడా ప్రారంభిస్తారు. సాయంత్రం పలు సంస్థలతో అవగాహన ఒప్పందాల (ఎంఓయూ) కార్యక్రమం ఉంటుంది. సదస్సు ముగింపులో మీడియా సమావేశం నిర్వహించి, సాధించిన ఫలితాలను సీఎం వివరిస్తారు.
ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సింగపూర్, యూఏఈ, యూకే దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర మంత్రులు కూడా దేశ, విదేశాల్లో పలు సంస్థలతో చర్చలు జరిపారు. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.






