Chandrababu Naidu: ఎమ్మెల్యేలకు మూడింది, రంగంలో సిఎం..!

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి(TDP) ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు అనే ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి పార్టీకి తలనొప్పిగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గాలికి వదిలేసి వ్యక్తిగత వ్యవహారాలను ఎమ్మెల్యేలు చక్కబెట్టడంపై చంద్రబాబునాయుడు అసహన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఒక్కో నియోజకవర్గంలో సర్వేకి చంద్రబాబు నాయుడు దిగుతున్నట్లు సమాచారం.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే కీలక సమాచారాన్ని సేకరించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది హైదరాబాదు(Hyderabad)లో, బెంగళూరులో మరికొంతమంది ఒడిస్సాలోని భువనేశ్వర్ లో, అలాగే మరికొంతమంది చెన్నైలో ఉండటం పట్ల చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా టిడిపి ఎమ్మెల్యేలు సమర్థవంతంగా నిర్వహించలేదు.
కొంతమంది తానా మహాసభల కోసం అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు బహిరంగంగానే కొంతమంది ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇక తిరుమల దర్శనం విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తున్నారు అనే విమర్శలు సైతం వినపడుతున్నాయి. ప్రోటోకాల్ దర్శనం పేరుతో కొంతమంది ఎమ్మెల్యేలు భారీ ధరకు దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు అనే విమర్శలు సైతం పార్టీ అధిష్టానానికి చేరాయనే వార్తలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో దీనిపై కార్యకర్తల్లో విమర్శలు సైతం ఉన్నాయి.
ఇక కాంట్రాక్టుల విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కక్కుర్తి పడుతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలు షాపుల వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే విమర్శలు సైతం వినిపించాయి. విజయవాడ పార్లమెంట్ లో కొంతమంది ఎమ్మెల్యేలు షాపుల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం పార్టీ అధిష్టానానికి చేరినట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. ఇప్పుడు వీటన్నిటిపై నేరుగా కార్యకర్తల నుంచే సమాచారం సేకరించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాబిన్ శర్మ టీం రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఇక ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ప్రచారం చేసే విషయంలో ఎమ్మెల్యేలు వెనుకబడి ఉంటున్నారు. ఎంపీలతో కలిసి పనిచేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రుల వద్దకు సమస్యలు తీసుకెళ్లే విషయంలో కూడా వెనుకబడుతున్నారు అనే ఆరోపణ సైతం ఉంది. దానికి తోడు వైసీపీ చేస్తున్న విమర్శలపై చాలామంది ఎమ్మెల్యేలు స్పందించకపోవడం పై పార్టీ అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పులివెందుల ఉపఎన్నిక విషయంలో రాయలసీమ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటాన్ని కూడా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.