Chandrababu: చంద్రబాబు పట్టు కోల్పోయారా..? పక్కదారి పట్టిస్తున్నారా..?

ఆంధ్రప్రదేశ్‌లో 2016లో జరిగిన తుని రైలు దహనం (Tuni Rail Incident) ఘటనపై పునర్విచారణకు సిద్ధమైన చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం, కేవలం ఒక రోజులోనే తమ నిర్ణయాన్ని మార్చుకుని, కేసును తిరిగి తెరవాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పునర్విచారణకు సంబంధించిన జీవో తమకు తెలియకుండానే జారీ అయిందని, దాని వెనుక బాధ్యులైన అధికారులను గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే, ఇంత పెద్ద నిర్ణయం సీఎం దృష్టికి రాకుండా జరిగిపోతుందా అనే అనుమానాలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన, చంద్రబాబు ప్రభుత్వం అధికార యంత్రాంగంపై పట్టు కోల్పోయిందనే విమర్శలను రేకెత్తిస్తోంది.
2016లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు (Kapu Reservations) కల్పించాలనే డిమాండ్‌తో ఆందోళనలు జరిగాయి. ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారి తూర్పు గోదావరి జిల్లాలోని తుని వద్ద రైలు బోగీలను దహనానికి దారి తీశాయి. ఈ ఘటనలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో.. తగిన సాక్ష్యాధారాలు లేవంటూ రైల్వే కోర్టు కేసును కొట్టేసింది. వైసీపీ ప్రభుత్వం కూడా దీనిపై తిరిగి అప్పీలుకు వెళ్లలేదు. పైగా ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కేసులను ఉపసంహరించుకుంది. ఇది కాపుల్లో మంచి పేరు తెచ్చింది.
అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, ఈ కేసును తిరిగి విచారించాలని నిర్ణయించి, విజయవాడ రైల్వే కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని జీవో జారీ చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఈ కేసును తిరగదోడడంపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో జీవో జారీ అయిన 24 గంటల్లోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ జీవో సీఎం చంద్రబాబు దృష్టికి రాకుండానే జారీ అయిందని, దాని వెనుక బాధ్యులైన వారిని గుర్తించే పనిలో ఉన్నామని ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జీవో జారీ అయిందని, విమర్శలు రావడంతో ఇప్పుడు నెపాన్ని అధికారులపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది.
ఇంత సున్నితమైన అంశంపై జీవో జారీ అయిన విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే, అధికార యంత్రాంగంపై చంద్రబాబుకు పట్టు లేదని, పరిపాలనలో గందరగోళం నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా పరిపాలనపై పూర్తి నియంత్రణ సాధించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన, ప్రభుత్వంలో అంతర్గత సమన్వయం లోపించిందని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో స్పష్టత లేదని సూచిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తుని కేసు జీవో ఉపసంహరణతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ, ప్రభుత్వం ముందుండే సవాళ్లు అలాగే ఉన్నాయి. అధికార యంత్రాంగంపై పట్టు సాధించడం, నిర్ణయాల తీసుకోవడంలో స్పష్టత, సమన్వయం పెంపొందించడం వంటివి ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తన విశ్వసనీయతను కాపాడుకోవాల్సి ఉంది. లేకపోతే, ఇలాంటి ఘటనలు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రభుత్వానికి మరింత నష్టం కలిగించే అవకాశం ఉంది.