రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి.. అమిత్‌షాకు చంద్రబాబు వినతి

రాష్ట్ర విభజన, గత ఐదేళ్ల వైసీపీ పాలన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాని గట్టెక్కించేందుకు ఈ నెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రత్యేక సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కోరారు. ఢిల్లీ లోని కృష్ణమీనన్‌మార్గ్‌లోని హోంమంత్రి నివాసంలో అమిత్‌షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వేగంగా పరిష్కరించడంతోపాటు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూతనివ్వాలని కోరారు. కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.