Jagan Arrest: జగన్ అరెస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అరెస్టుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “జగన్ నన్ను జైల్లో వేశాడు కాబట్టి నేను కూడా ఆ పని చేయాలా? అది నా విధానం కాదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు జగన్ అరెస్టుపై ఊహాగానాలను రేకెత్తించాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన కార్యకర్తలు జగన్‌ను జైలుకు పంపాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఈ విషయంలో చట్టపరంగానే వెళ్లాలని స్పష్టం చేశారు.
“ఫలానా వ్యక్తి నేరస్తుడని మనం అనుకుంటే సరిపోదు. ఆధారాలతో శిక్షిస్తేనే ప్రజలు ఆమోదిస్తారు. అలాగని తప్పు చేసిన వారికి శిక్ష వేయకుండా ఉండడం నా విధానం కాదు” అని చంద్రబాబు కేబినెట్ సహచరులకు వివరించారు. ఈ వ్యాఖ్యలు ఆయన కక్షసాధింపు రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వం చంద్రబాబును 56 రోజుల పాటు జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి వ్యక్తిగత కక్షలకు పోవడం సరైనది కాదని, అలా చేస్తే రాజకీయంగా దీర్ఘకాలికంగా నష్టం వాటిల్లవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ, జనసేన కార్యకర్తలు జగన్‌పై అక్రమాస్తుల కేసులు, లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణల ఆధారంగా అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు మాత్రం చట్టపరమైన ప్రక్రియలను గౌరవిస్తూ, ఆధారాల ఆధారంగా మాత్రమే శిక్షలు విధించాలని సూచిస్తున్నారు. “శ్రుతి మించి ప్రవర్తిస్తే జగన్ లాగా పరాభవం చవిచూడాల్సి వస్తుంది” అని ఆయన భయపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసును కూడా ముందుకు తీసుకెళ్లడంలో జాగ్రత్త వహిస్తోంది.
ఈ నేపథ్యంలో.. జగన్ అరెస్టు ఉండకపోవచ్చనే ఊహాగానాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు, లిక్కర్ కేసు వంటి ఆరోపణలతో అరెస్టు చేసినప్పుడు, అది రాజకీయ కక్షసాధింపుగా పరిగణించబడింది. ఇప్పుడు చంద్రబాబు అదే తప్పు చేయడానికి ఇష్టపడటం లేదు. బదులుగా.. ఆయన చట్టబద్ధంగా, ఆధారాలతో కూడిన ప్రక్రియ ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విధానం కొంతమంది కూటమి కార్యకర్తలలో అసంతృప్తిని కలిగిస్తోంది. ఎందుకంటే వారు జగన్‌పై తక్షణ చర్యలు ఆశిస్తున్నారు.
జగన్‌పై ఇప్పటికే అక్రమాస్తుల కేసు సహా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ జగన్‌ను జైలుకు పంపించాలనుకుంటే ఇవి సరిపోతాయని కొందరు భావిస్తున్నారు. అయినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఈ కేసులను వేగవంతం చేయకపోవడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. కొందరు విశ్లేషకులు దీనిని చంద్రబాబు రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారు. జగన్‌ను అరెస్టు చేయడం ద్వారా వైఎస్ఆర్‌సీపీకి సానుభూతి ఓట్లు వచ్చే అవకాశం ఉందని, అది కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగించవచ్చని వారు అంచనా వేస్తున్నారు.