Atchannaidu: చంద్రబాబు ఓ మాటతో అచ్చెన్నలో మార్పు ..విశాఖ యోగా డేలో ఆకర్షణగా మారిన మంత్రిగారు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (Visakhapatnam) లో నిర్వహించిన యోగా కార్యక్రమం చారిత్రాత్మకంగా మారింది. 3 లక్షల మందికిపైగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు (Guinness Record) స్థాయికి చేరింది. అయితే ఇందులో ఒక ఆసక్తికర దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్ద కాయంతో ప్రసిద్ధి గాంచిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కూడా యోగాసనాలు వేస్తూ కనిపించారు.
అచ్చెన్నాయుడు సాధారణంగా క్రీడలు, యోగా వంటి శారీరక క్రియలకు దూరంగా ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు. శిక్షకులు సూచించిన విధంగా ఆయన సమర్థంగా యోగాసనాలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విధమైన యోగ సాధన చేయడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన మీడియాతో పంచుకున్నారు.
ఈ ప్రేరణకి మూలం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అని అచ్చెన్న పేర్కొన్నారు. యోగా కార్యక్రమానికి ముందు జరిగిన సమావేశంలో, ముఖ్యమంత్రి అచ్చెన్నాయుడుతో మీరు యోగాసనాలు చక్కగా చేయలేకపోతే విశాఖ కార్యక్రమానికి రావొద్దు,” అని చెప్పినట్టు చెప్పారు. ఈ మాటలు తనలో ఓ దృఢ సంకల్పాన్ని రేకెత్తించాయని అచ్చెన్న తెలిపారు. తన శరీర బరువు ఏకైక అడ్డంకి కాదని భావించి, యోగా సాధనలో నిపుణుల్లా పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. కార్యక్రమానికి ముందుగా సాధన చేసి, దానికి తగినట్టే ప్రదర్శన ఇవ్వడం ఆయన ధృడ సంకల్పానికి నిదర్శనం. అంతేకాకుండా, తన ప్రయత్నానికి గుర్తింపు రావాలనే కోరికతో , ప్రతి ఆసనాన్ని ఖచ్చితంగా చేశానని, ఒక్క తప్పూ చేయలేదని అన్నారు.
అచ్చెన్నాయుడు చూపిన ఈ మానసిక ధైర్యం, సంకల్పబలానికి మంచి ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా శారీరక పరిమితులు వల్ల దూరంగా ఉండే క్రియలో ఈ విధంగా పాల్గొనడం నిజంగా మిగతా వారికీ ప్రేరణ కలిగించేదిగా ఉంది. ముఖ్యమంత్రికి చెప్పిన మాటలే ఆయనలో మార్పును తీసుకురావడమే కాక, యోగా పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగించాయి. ఇది యోగా మహత్తును సూచించే మరో ఉదాహరణగా నిలిచింది.