Chandra Babu: ఉత్తరాంధ్రకు నూతన ఊపిరి: విశాఖ కేంద్రంగా ఆర్థిక ప్రగతి షురూ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి మరింత మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా ఒక విశాలమైన ఆర్థిక ప్రాంతాన్ని రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రకటించారు. అమరావతి (Amaravati) లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ దిశగా కీలక ఆలోచనలు చర్చకు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ఆర్థిక ప్రాంతాన్ని “గ్రోత్ ఇంజిన్”గా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. సుమారు 120 బిలియన్ డాలర్ల విలువైన సంపదను 2032 నాటికి ఈ ప్రాంతం అందించాలని ప్రభుత్వ అంచనా. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం (Srikakulam), అనకాపల్లి (Anakapalli), కాకినాడ (Kakinada), తూర్పు గోదావరి (East Godavari), ఏఎస్ఆర్ (ASR), మన్యం (Manyam) జిల్లాలు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున భూసేకరణ జరగనుండగా, దాదాపు లక్ష ఎకరాల స్థలాన్ని గుర్తించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ ఆర్థిక పరిధిలో ప్రస్తుతం 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. జనాభా దాదాపు 1.55 కోట్లకు చేరుకుంది. ఇప్పుడే 49 బిలియన్ డాలర్ల స్థాయిలో జీడీపీ నమోదు అవుతుండగా, రాబోయే ఏడేళ్లలో అది మరింత పెరగనుంది. ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా ఏర్పడతాయని అంచనా. ఈ ప్రాంతంలో ఇప్పటికే 6 పోర్టులు, 7 తయారీ కేంద్రాలు, 17 వ్యవసాయ ప్రాంతాలు, 6 సేవా హబ్‌లు, 12 పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేసి ఆర్ధికంగా సమృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
మౌలిక వసతులు, పట్టణీకరణ, ఐటీ రంగం, హెల్త్‌కేర్, వ్యవసాయం, టూరిజం, పోర్టుల అభివృద్ధి వంటి రంగాలను ముఖ్యంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్న దిశగా సీఎం ఆదేశించారు. ఈ ప్రణాళికలు అమలవితే 7.5 లక్షల గృహాలు, 10 వేల హోటల్ గదులు, 20 ఇన్నోవేషన్ కేంద్రాలు, 10 విద్యా సంస్థలు, 7 వేల ఆసుపత్రి పడకలు, 20 వేల హెక్టార్లలో పరిశ్రమలు, కోట్ల అడుగుల కార్యాలయ, గోదాము విస్తీర్ణాలు ఏర్పడే అవకాశం ఉంది. విశాఖ నుంచి కాకినాడ దాకా బీచ్ రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. వీటిని జాతీయ రహదారులతో కలపాలని చూస్తున్నారు. సముద్రతీరాన్ని భవిష్యత్తు సంపదగా మలచాలన్న సంకల్పంతో సీఎం ముందడుగు వేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పథకంలో 20 లక్షల మందికి అవకాశం కల్పించాలన్నది ముఖ్య ఉద్దేశం.