Pawan Kalyan: సినిమాలకు బ్రేక్.. ఇక స్పీడ్ పెంచనున్న పవన్ కల్యాణ్..!!

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీపై దృష్టి పెట్టబోతున్నారు. పార్టీ బలోపేతం దిశగా కీలక అడుగులు వేయబోతున్నారు. 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి, రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన (Janasena) పార్టీ. ఇప్పుడు 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సమగ్ర వ్యూహాలను రూపొందిస్తోంది. అక్టోబర్ నుంచి పార్టీ కార్యకలాపాలపై పూర్తి దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈలోపు సినిమా షూటింగ్‌లను పూర్తి చేసుకుని పూర్తిగా రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారట.
జనసేన ప్రస్తుతం 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గాలతో పాటు మరో 50-60 నియోజకవర్గాల్లో బలపడాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు సమాచారం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్వహించారు. సర్వే అనంతరం జనసేన బలంగా ఉన్న స్థానాలు, బలపడేందుకు అవకాశం ఉన్న స్థానాలనుగ గుర్తించనున్నారు. అలాంటి 60 స్థానాలను ఎన్నుకుని అక్కడ పూర్తిగా పట్టు సాధించాలనే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు సమాచారం. స్థానిక సమస్యలపై ప్రజలతో మమేకం కావడం ద్వారా రాజకీయ ఆధిపత్యాన్ని స్థాపించాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలను పార్టీ గుర్తించనుంది.
పార్టీ బలోపేతంలో భాగంగా, జనసేన త్వరలో జిల్లా అధ్యక్షుల నియామకంపై దృష్టి సారించనుంది. స్థానిక నాయకత్వాన్ని బలపరిచేందుకు, సమర్థవంతమైన నాయకులను ఎంపిక చేసి, జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలను పటిష్ఠం చేయడం లక్ష్యంగా ఉంది. ఈ నియామకాలు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడంతో పాటు, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైతే ఇంటింటికీ జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచనలో ఉంది. ఈ కార్యక్రమం ద్వారా, పార్టీ కార్యకర్తలు ప్రజలతో నేరుగా సంప్రదించి, వారి సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు, జనసేన సిద్ధాంతాలను వివరించనున్నారు.
ప్రస్తుతం టీడీపీ, బీజేపీతో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన, సొంతంగా బలపడేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి విజయంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. టీడీపీ 144 స్థానాల్లో 135, బీజేపీ 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకోగా, జనసేన 21 స్థానాల్లో 100 శాతం విజయం సాధించింది. అయితే, కూటమి భాగస్వామ్యంతో పాటు, స్వతంత్రంగా పార్టీని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో మరింత ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. 2029 ఎన్నికల నాటికి కనీసం 60 స్థానాల్లో బలపడాలనే లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది. 2019 ఎన్నికల్లో కేవలం ఒక సీటు గెలుచుకున్న జనసేన, 2024లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉంది. గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా కేటాయించిన ఎన్నికల సంఘం నిర్ణయం, పార్టీకి మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ దూరదృష్టితో, 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సమగ్ర వ్యూహంతో ముందుకు సాగుతోంది.