Kuppam: చంద్రబాబు నియోజకవర్గం లో మహిళ పై దారుణం..

ఏపీలో కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency) పరిధిలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని, ఓ మహిళను ఆమె కుమారుడి కళ్లముందే చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన అందరినీ కలచివేసింది. ముఖ్యంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జరగడం అందరిలో ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిందితుడు మునికన్నప్ప అనే వ్యక్తిగా గుర్తించబడగా, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నారాయణపురం గ్రామంలో (Narayana Puram) జరిగిన ఈ ఘటనపై సీఎం ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడు అరెస్టులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా తాను ఈ ఘటనపై సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. ఇది మన సమాజానికి మచ్చ అని, తల్లిని కుమారుడి ఎదుటే ఇలా అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి జరుగుతుంటే మహిళా హోంమంత్రి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు అని ప్రశ్నించిన షర్మిల, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధైర్యాన్ని అక్కడి వారికి ఎవరు ఇచ్చారని నిలదీశారు.
ఒకవైపు మహిళల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోతే ఎలా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని (TDP) “తెలుగింటి ఆడపడుచుల పార్టీ”గా చెప్పుకుంటూ, ఆడవారిని రక్షించడంలో విఫలమవుతుందన్న విమర్శించారు.
ఇక బాధిత మహిళకు సహాయం చేయాలని, ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్న ఆదేశాలు అందాయి. సంఘటన తీవ్రతను చూసిన ప్రజలు మహిళల రక్షణపై ప్రభుత్వాన్ని మరింత చొరవ చూపాలని కోరుతున్నారు.